anupama shani: కొత్త పార్టీతో రాజకీయాల్లోకి వస్తున్న నాటి డీఎస్పీ!
- 2014లో కూడ్లిగి డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనుపమ షణై
- మంత్రితో విభేదించి, ఎదరించిన అనుపమ
- 2016లో డీఎస్పీ పదవికి రాజీనామా
బళ్లారి జిల్లా కూడ్లిగి డీఎస్పీగా 2014 సెప్టెంబర్ లో అనుపమ షణై బాధ్యతలు స్వీకరించి, అక్రమార్కులు, అక్రమ మద్యం వ్యాపారాలపై ఉక్కుపాదం మోపి సంచలనం సృష్టించారు. అక్రమ మద్యం కట్టడి విషయంలో అప్పటి జిల్లా ఇన్ ఛార్జి మంత్రి పరమేశ్వర్ నాయక్ తో ఆమె విభేదించారు. దీంతో నేరుగా ఇద్దరూ విమర్శలు చేసుకున్నారు. ఒకరకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె గళమెత్తారు. ప్రభుత్వమే అక్రమ మద్యాన్ని ప్రోత్సహిస్తోందంటూ మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఆమెకు ప్రజల్లో భారీ సంఖ్యలో అభిమానులు ఏర్పడ్డారు. ఊహించని విధంగా 2016లో ఆమె డీఎస్పీ పదవికి రాజీనామా చేశారు. అనంతరం మౌనంగా వుండిపోయారు.
ఇప్పుడు మౌనాన్ని వీడి, తాజాగా కల్బుర్గిలో తన అభిమాన సంఘం ఆధ్వర్యంలో జరిగిన మహిళా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాను రాజకీయ పార్టీ స్థాపించబోతున్నానని ఆమె ప్రకటించారు. దానికి మహిళల మద్దతు అవసరమని ఆమె కోరారు. రాజకీయ పార్టీలన్నీ చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తాయి కానీ, అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీలన్నీ మోసం చేస్తున్నాయని అన్నారు. తమ పార్టీలో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తానని ఆమె స్పష్టం చేశారు. కర్ణాటకలో 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 100 అసెంబ్లీ సీట్లు మహిళలకు కేటాయిస్తానని ఆమె ప్రకటించారు. ఎక్కడైతే ఆమె పదవిని వదిలేశారో..అదే కుడ్లిగిలో నవంబర్ 1న బహిరంగ సభ ఏర్పాటు చేసి, పార్టీ ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది.