aadhaar: ప్రభుత్వానికి 9 బిలియన్ డాలర్లు ఆదా చేసిన ఆధార్: నందన్ నిలేకని
- అవకతవకలకు తావు లేకుండా చేసిందని వ్యాఖ్య
- ప్రభుత్వ పథకాలు నిజమైన లబ్దిదారులే పొందారన్న యూఐడీఏఐ మాజీ చైర్మన్
- ప్రపంచ బ్యాంక్ ప్యానల్‌తో చర్చ
ప్రజలందరికీ ఏకైక గుర్తింపు నెంబరు ఉండాలంటూ భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆధార్ కార్యక్రమం వల్ల నిజమైన లబ్దిదారులకు మేలు కలిగిందని, అవకతవకలకు తావు లేకపోవడంతో ప్రభుత్వానికి 9 బిలియన్ డాలర్ల వరకు ఆదా అయిందని యూఐడీఏఐ మాజీ చైర్మన్ నందన్ నిలేకని తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన ప్రపంచ బ్యాంకు ప్యానల్‌తో చర్చించారు. ఈ సందర్భంగా నందన్ నిలేకని `డిజిటల్ ఎకానమీ ఫర్ డెవలప్మెంట్` అనే అంశం మీద మాట్లాడారు.
ఆధార్ నంబర్ జారీ కార్యక్రమాన్ని గత యూపీఏ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చినా, నరేంద్రమోదీ ప్రభుత్వం కూడా ఎంతో ఉత్సాహంగా దీనిని ముందుకు తీసుకెళుతోందని నిలేకని అన్నారు. ఆధార్ నంబర్‌తో బ్యాంకు ఖాతాల అనుసంధానం గురించి కూడా ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు 50 కోట్ల మంది తమ ఆధార్ నంబర్‌ను బ్యాంకు ఖాతాలకు జత చేసుకున్నారని ఆయన చెప్పారు. దీని వల్ల ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు అందాల్సిన డబ్బు మొత్తం నేరుగా వారి బ్యాంకు ఖాతాలకే బదిలీ అవుతోందని తెలిపారు. ఆధార్ వల్ల అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు, చెల్లింపులు లాంటివన్నీ సులభతరమయ్యాయని నిలేకని పేర్కొన్నారు.