samsung electronics: రాజీనామా చేసిన శాంసంగ్ కంపెనీ సీఈఓ క్వాన్ ఓహ్-హున్
- కారణాలు వెల్లడించని క్వాన్
- ఇటీవలే జైలు పాలైన శాంసంగ్ గ్రూప్ అధినేత జే వై లీ
- అప్పటి నుంచి కీలక పాత్ర పోషిస్తున్న హున్
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్ సీఈఓ క్వాన్ ఓహ్-హున్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాకు గల కారణాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. ఇటీవల అవినీతి కేసులో శాంసంగ్ గ్రూప్ అధినేత జే వై లీ జైలు పాలైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి హున్ కంపెనీలో కీలక బాధ్యత పోషిస్తున్నారు. అలాంటి హున్ ఇప్పుడు అకస్మాత్తుగా రాజీనామా చేయడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. శాంసంగ్ కంపెనీలో చిప్, డిస్‌ప్లే అధినేతగా హున్ పనిచేస్తున్నారు.
కంపెనీకి సంబంధించి రికార్డు క్వార్టర్ ఆపరేటింగ్ ప్రాఫిట్‌లను అంచనా వేస్తున్న సమయంలోనే ఈయన రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. కంపెనీ లాభాల్లో ఉన్నప్పటికీ హున్ రాజీనామా చేయడానికి కారణాలు ఏంటనే విషయం తేలాల్సి ఉంది. మెమరీ చిప్స్, స్మార్ట్‌ఫోన్లు, టీవీల్లో ప్రపంచంలోనే అతిపెద్ద తయారీదారుగా ఉన్న శాంసంగ్, ఈ ఏడాది రికార్డు లాభాలను నమోదు చేయబోతోంది.