Modi: మోదీ జీ! నల్లధనంలో నా వాటా నాకు ఇచ్చేయండి.. లేఖ రాసిన రైతు!
- ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్
- ప్రస్తుతం ఓ రూ.5 లక్షలు తన ఖాతాలో జమ చేయాలని కోరిన వైనం
- గతంలో నటుడు మమ్ముట్టిపైనా కోర్టుకెక్కిన రైతు
ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న నల్లధనంలో తన వాటాగా రావాల్సిన రూ.15 లక్షలలో కనీసం రూ.5 లక్షలైనా తనకు ఇవ్వాలని కేరళకు చెందిన ఓ రైతు ప్రధాని మోదీకి లేఖ రాశాడు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరాడు. నిత్యావసరాల ధరలు పెరుగుతుండడంతో బతుకు దుర్భరంగా మారుతోందని, కాబట్టి ఇచ్చిన హామీ ప్రకారం ప్రస్తుతం రూ.5 లక్షలు తన ఖాతాలో వేయాలని కోరాడు.
వయనాడ్కు చెందిన కె.చాతు (68) ప్రధానికి లేఖ రాస్తూ.. ‘‘దేశవిదేశాల్లో అక్రమార్కులు దాచుకున్న నల్ల ధనాన్ని స్వాధీనం చేసుకుంటానని ఎన్నికల సమయంలో మీరు వాగ్దానం చేశారు. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తాను అని హామీ ఇచ్చారు. మీరు అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయింది. అయినా హామీ అలానే ఉంది. స్వాధీనం చేసుకున్న సొమ్ములో నా వాటా ధనాన్ని ఇవ్వండి. ప్రస్తుతానికైతే ఓ రూ.5 లక్షలు నా ఖాతాలో జమ చేయండి’’ అని వేడుకుంటూ తన ఖాతా నంబరును కూడా పేర్కొన్నాడు.
మాజీ మావోయిస్టు అయిన చాతు గతంలో సినీ నటుడు మమ్ముట్టికి వ్యతిరేకంగా కోర్టుకెక్కాడు. అప్పట్లో ఓ సబ్బుల కంపెనీకి ఆయన ప్రచారం చేశారు. అయితే ఆ సబ్బును తాను నెల రోజులు వాడినా తెల్లబడలేదంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తనకు నష్టపరిహారంగా రూ.50 వేలు ఇప్పించాలని కోరాడు. దీంతో దిగొచ్చిన సబ్బుల కంపెనీ చాతుకు రూ.30 వేలు చెల్లించి సమస్యను పరిష్కరించుకుంది.