mother: 'అమ్మా! నువ్వు రాకపోతే నేనే నీ దగ్గరకు వచ్చేస్తా'... మరణించిన అమ్మకు సౌదీ బాలుడి లేఖ.. చదివి కన్నీరు పెడుతున్న నెటిజన్లు!
- మరణించిన తల్లికి లేఖ రాసిన సౌదీ బాలుడు
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖ
- లెటర్ చదివి కన్నీరు పెట్టుకుంటున్న నెటిజన్లు
సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రపంచం చాలా చిన్నదైపోయింది. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతోంది. మరణించిన తన తల్లి పేరిట ఓ పిల్లాడు రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ లేఖను చదివిన నెటిజన్లు కన్నీరు పెట్టుకుంటున్నారు. పిల్లాడికి ఎంత కష్టమొచ్చింది? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దాని వివరాల్లోకి వెళ్తే... సౌదీఅరేబియాలోని రియాద్ నగరంలో నివసించే అరబ్ బాలుడి తల్లి మరణించింది. తల్లి మరణంతో తన అనుబంధాన్ని నెమరువేసుకుంటూ.. ఇక అల్లరి చెయ్యనని చెబుతూ.. అమ్మకు లేఖ రాశాడు.
‘‘అమ్మా! ఎక్కడికి వెళ్లిపోయావమ్మా? అందరూ నువ్వు రావంటున్నారు. నువ్వు చనిపోయావంటున్నారు. అంటే ఏంటి అమ్మా? నువ్వు దేవుడి దగ్గరకు వెళ్లావంటున్నారు. నువ్వు ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండాలని దేవుడిని కోరుకుంటున్నానమ్మా. నేను రోజూ శ్రద్ధగా తింటున్నానమ్మా. ఎవరినీ విసిగించడం లేదు. నాన్న చెప్పినట్లు వింటున్నాను. ఇంతకుముందులా ఇంటిని చిందరవందర చేయడం లేదు. అమ్మా! నన్ను క్షమించమ్మా. నువ్వు తిరిగి రామ్మా. మాతో కలిసి ఉండు. ఇకపై నువ్వు ఏం చెప్పినా వింటానమ్మా. నిద్రలో కూడా మాటిమాటికి లేచి నిన్ను నిద్రపోనివ్వకుండా చేయను. ప్లీజ్ అమ్మా.. నా దగ్గరకు వచ్చేయమ్మా. నువ్వు రాకుంటే నేను నీ దగ్గరకు వచ్చేస్తాను. అమ్మా! నాతో పాటు ఈ లేఖను కూడా తెస్తా.
నేను రాసిన ఈ లేఖను నీకు చూపిస్తా. నీపై నాకు ఎంత ప్రేమ ఉందో, నిన్ను ఎంతగా మిస్ అవుతున్నానో చెబుతానమ్మా...ప్లీజ్ రామ్మా. నా దగ్గరకు వచ్చెయ్’ అంటూ రాసిన లేఖ నెటిజన్ల గుండెలు పిండేస్తోంది. ఈ లేఖను చదివిన ప్రతిఒక్కరూ చెప్పేది ఒకటే మాట.. 'దీనిని చదివిన వెంటనే కన్నీరుపెట్టుకున్నాను' అని! చిన్నతనంలోనే ఇంతటి కష్టం రావడం భరించలేని విషయమని పలువురు పేర్కొంటుండగా, మరో నెటిజన్ మరింత ముందుకు వెళ్లి... ‘మిత్రులారా, మీకో ఛాలెంజ్.. ఈ లేఖను చదివి మనసు ద్రవించని వారు, కన్నీరు కార్చకుండా వుండని వారు ఎవరైనా ఉంటారా?’ అంటూ సవాలు విసిరాడు.