nannapaneni rajakumari: టీవీ సీరియల్స్ పై ఉక్కుపాదం మోపాలి.. కుటుంబాలు నాశనం అవుతున్నాయి: చంద్రబాబుకు నన్నపనేని వినతి
- సీరియల్స్ లో మోతాదుకు మించుతున్న హింస
- మహిళలను క్రూరంగా చూపిస్తున్నారు
- కేంద్రానికి విన్నవించినా.. స్పందన రాలేదు
టీవీ సీరియల్స్ లో హింసను స్థాయికి మించి చూపిస్తున్నారని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను క్రూరంగా చిత్రీకరిస్తున్నారని... ఈ సీరియల్స్ వల్ల కుటుంబాల్లో గొడవలు పెరిగిపోయాయని అన్నారు. ఈ మేరకు ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి నివేదించారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం వస్తున్న సీరియల్స్ లో ఏడాది పొడవునా హింసాత్మక సన్నివేశాలే ఉంటున్నాయని అన్నారు. ఈ హింసను కట్టడి చేసేందుకు సెన్సార్ బోర్డు ఉండాలని చెప్పారు. ఇదే విషయాన్ని తాను ఇంతకు ముందే కేంద్ర ప్రభుత్వానికి విన్నవించానని... అయినా ఎలాంటి స్పందన రాలేదని అన్నారు. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రిని కలసి వినతిపత్రం అందించానని తెలిపారు.