congress: త్వరలో కాంగ్రెస్ పగ్గాలు రాహుల్ చేతికి... సంకేతమిచ్చిన సోనియా!
- ప్రణబ్ ముఖర్జీ పుస్తకావిష్కరణలో మాట్లాడిన పార్టీ చీఫ్
- త్వరలో సమావేశం కానున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ
- ఇప్పటికే రాహుల్‌ను అధ్యక్షుడిగా తీర్మానించిన రాష్ట్ర కమిటీలు
ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని అధ్యక్ష పదవిలో చూడటానికి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. త్వరలోనే వారి ఎదురుచూపులు ముగిసి, మంచి వార్త వినే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాహుల్‌కి కాంగ్రెస్ పగ్గాలు అప్పగించడంపై పార్టీ చీఫ్ సోనియా గాంధీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పుస్తకాల మూడో సంకలనం విడుదల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ప్రసంగిస్తూ, ఈ విషయంపై కొన్ని సంకేతాలిచ్చారు.
`చాలా కాలంగా రాహుల్ అధ్యక్ష పదవి గురించి నన్ను అడుగుతున్నారు. ఇక అదే జరగనుంది` అని ఆమె అన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఈ విషయంపై స్పందించకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా, ఈ విషయంపై నిర్ణయం తీసుకునేందుకు త్వరలోనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కానుంది. ఇప్పటికే దాదాపు రాష్ట్రాల కమిటీలు కూడా రాహుల్‌కు బాధ్యతలు అప్పగించాలంటూ తీర్మానాలు చేశాయి. కొత్త పీసీసీ అధ్యక్షులు, పార్టీ కేంద్ర కమిటీల ఎంపిక తర్వాత అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ కొనసాగుతుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.