beer: అక్టోబర్ నెలలో పుంజుకున్న మద్యం అమ్మకాలు...సగటున రోజుకి రూ. 50 కోట్లకి పైగా ఆదాయం!

  • కొత్త మద్యం పాలసీ వచ్చాక అమ్మకాల్లో వృద్ధి
  • అడుగంటుతున్న బీరు నిల్వ‌లు
  • ఇత‌ర రాష్ట్రాల నుంచి దిగుమ‌తి

అక్టోబ‌ర్ 1 నుంచి తెలంగాణ‌లో కొత్త మద్యం పాల‌సీ అందుబాటులోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌టి నుంచి 13 తేదీ వ‌ర‌కు మ‌ద్యం అమ్మ‌కాలు పుంజుకున్నాయి. ఈ 12 రోజుల్లో రాష్ట్రంలో రూ.700 కోట్ల మద్యం అమ్మారు. ఆ లెక్కన చూస్తే, సగటున రోజుకు రూ.50 కోట్ల పైగా విలువైన మద్యాన్ని తాగేస్తున్నారు. ముఖ్యంగా బీరు అమ్మ‌కాలు విప‌రీతంగా పెరిగిపోయాయి.

 దీంతో రాష్ట్రంలో బీరు నిల్వ‌లు త‌గ్గిపోవ‌డంతో, ప‌క్క రాష్ట్రాల నుంచి దిగుమ‌తి చేసుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్పడింది. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి ఏడెనిమిది లక్షల కేసుల బీర్లు దిగుమతి చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఒక్క అక్టోబ‌ర్‌ నెలలోనే నాలుగు లక్షల కేసుల బీర్లు దిగుమతి చేసుకోవాల్సి వ‌స్తోంది. సాధారణంగా వేసవి కాలంలో బీరు అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. అక్టోబరు నెల వచ్చినప్పటికీ అమ్మకాల్లో వృద్ధి క‌నిపించ‌డం అధికారుల‌ను ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.

గ‌త ఏడాది ఏప్రిల్‌- సెప్టెంబరు మధ్యకాలంలో 176 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోగా ఈ ఏడాది ఇదే సమయానికి 223 లక్షల కేసుల బీర్లు అమ్మారు. దీన్ని బ‌ట్టి చూస్తే ఈ ఏడాది బీరు అమ్మ‌కాల్లో 27.15 శాతం వృద్ధి క‌నిపించింది. ఈ లెక్క‌న స‌గ‌టున రోజుకు 12 లక్షల బీర్లు అమ్ముడ‌వుతున్నాయి. అక్టోబ‌ర్ నాటికి చ‌లికాలం ప్రారంభంకావాల్సి ఉన్నా, బీర్ల అమ్మ‌కాలు పెరుగుతూనే ఉన్నాయ‌ని అధికారులు చెబుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో మద్యం అమ్మకాల్లో తెలంగాణ ముందుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రెండో స్థానంలో ఉంది.  రాబోయే రోజుల్లో ఈ అమ్మ‌కాలు మ‌రింత పెరిగే అవ‌కాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News