rain forecast: ఈ దీపావళికి మీ టపాకాయలు పేలకపోవచ్చు.. తుపాను ముంచుకొస్తోంది!
- రుతుపవనాల కారణంగా తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
- మరోవైపు బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడి, తుపానుగా మారే అవకాశం
- దీపావళికి భారీ వర్షాలు కురిసే అవకాశం
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే దీపావళి సందడి మొదలైంది. టపాకాయల షాపులు కూడా ఏర్పాటవుతున్నాయి. అయితే, దీపావళినాడు టపాకాయలు కాల్చి, సందడి చేద్దామనుకుంటున్నవారికి నిరాశ మాత్రమే మిగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే, బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడి, తుపానుగా మారబోతోంది. ఈ విషయాన్ని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అరేబియా సముద్రం నుంచి తూర్పు దిశగా కదులుతున్న మేఘాలు బంగాళాఖాతం ప్రాంతంలోకి వేగంగా ప్రవేశిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఆదివారం నాడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం మరింత ఉద్ధృతమై వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది తుపానుగా మారుతుందా? లేదా? అనే విషయం 16వ తేదీన తెలుస్తుంది. తుపానుగా మారకపోయినా ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. మరోవైపు నైరుతి రుతుపవనాల కారణంగా ఏపీ, తెలంగాణ, దక్షిణ కర్ణాటక, పుదుచ్చేరిల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావం కూడా దీపావళి వరకు కొనసాగే అవకాశం ఉంది.