sabarimala: మహిళల్ని ఆలయంలోకి అనుమతిస్తే శబరిమల మరో థాయ్‌లాండ్ అవుతుంది: ఆలయ బోర్డు అధ్యక్షుడు
- నీతిలేని పనులకు నిలయంగా మారుతుందని వ్యాఖ్య
- ఖండించిన కేరళ దేవాలయ వ్యవహారాల మంత్రి
- గతంలో కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన ఆలయాధికారి
శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతిస్తే దేవాలయ ప్రాంగణం నీతిలేని పనులకు నిలయంగా మారుతుందని, థాయ్‌లాండ్ తరహాలో అశ్లీల పర్యాటకానికి అడ్డాగా మారుతుందని ఆలయ బోర్డు అధ్యక్షుడు ప్రయార్ గోపాలకృష్ణన్ అన్నారు. దశాబ్దాల సంప్రదాయానికి స్వస్తి పలుకుతూ ఆలయం లోపలికి మహిళలను అనుమతించడంపై విచారణ కోసం రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలని శుక్రవారం నాడు సుప్రీంకోర్టు నిర్ణయించింది.
ఈ విషయంపై ట్రావెన్‌కోర్ దేవసోం బోర్డు అధ్యక్షుడు ప్రయార్ గోపాలకృష్ణన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను కేరళ రాష్ట్ర దేవాలయ వ్యవహారాల మంత్రి కాకంపల్లి సురేంద్రన్ ఖండించారు. `గోపాలకృష్ణన్ ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశాడో అర్థం కావట్లేదు. మహిళలను, యాత్రికులను ఆయన అవమానించారు. అందుకు గాను క్షమాపణ కోరాలి` అని మంత్రి అన్నారు.
`ఒకవేళ మహిళల్ని అనుమతిస్తే, వారి రక్షణకు మేం గ్యారంటీ ఇవ్వలేం. శబరిమలను థాయ్‌లాండ్‌లాగ మార్చాలని మేం అనుకోవట్లేదు. ఒకవేళ సుప్రీంకోర్టు అనుమతినిచ్చినా... కొండ మీదికి వెళ్లేందుకు మహిళలకు చాలా ధైర్యం ఉండాలి` అని ప్రయార్ అన్నారు. మహిళల్ని అనుమతించకపోవడం కొన్ని తరాలుగా వస్తున్న సంప్రదాయమని, దాన్ని గౌరవించాలని, ఒకవేళ వారిని అనుమతిస్తే చాలా సమస్యలు వస్తాయని, నీతిలేని పనులు జరిగే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. గతంలో కూడా గోపాలకృష్ణన్ ఇలాంటి వ్యాఖ్యలే చేసి వార్తల్లో నిలిచారు.