face book: ఇకపై ఫేస్బుక్ ద్వారా మీకు ఇష్టమైన రెస్టారెంట్ల నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు!
- మరో ఫీచర్ తో ఆకర్షిస్తోన్న ఫేస్బుక్
- 'ఆర్డర్ ఫుడ్' విభాగం ద్వారా ఫుడ్ ఆర్డర్
- యూజర్లకు దగ్గరలోని రెస్టారెంట్ల నుంచి ఫుడ్
సోషల్‌మీడియా వెబ్ సైట్ ఫేస్బుక్ తమ యూజర్ల ముందుకు మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇకపై ఆ వెబ్సైట్ ద్వారా ఫుడ్ ఆర్డర్‌ను కూడా నేరుగా చేసుకోవచ్చు. ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలనుకునేవారు ఫేస్బుక్ మెనులో 'ఆర్డర్ ఫుడ్' విభాగాన్ని చూడవచ్చని తెలిపింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమకు దగ్గరలో ఉన్న రెస్టారెంట్ల నుంచి ఫుడ్‌ను తెప్పించుకునే విధంగా దీన్ని రూపొందించినట్లు తెలిపింది.
ఆ విభాగంలో స్టార్ట్ ఆర్డర్ బటన్ క్లిక్ చేస్తే యూజర్లు తమకు ఇష్టమైన ఫుడ్‌ను ఎంచుకోవచ్చని వివరించింది. ముందుగా ఈ ఫీచర్ ను అమెరికాలో ప్రారంభించినట్లు పేర్కొంది. త్వరలోనే మరిన్ని దేశాల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఇంటి నుంచి బయట కాలు పెట్టకుండా, అలాగే వేరే వెబ్సైట్లలో సెర్చ్ చేసే అవసరం లేకుండా యూజర్లు తమకు ఇష్టమైన రెస్టారెంట్ నుంచి కావలసిన పదార్థాలను తెప్పించుకోవచ్చని పేర్కొంది. కొత్త ఫీచర్లను ప్రవేశ పెడుతూ తమ యూజర్లను ఆకట్టుకోవడంలో ముందుండే ఫేస్బుక్ ఇప్పటికే ఎన్నో ఫీచర్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.