NTR: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’.. తెర వెనుక.. ముందూ వైసీపీ నేతలే!
- అంచనాలను పెంచుతున్న ఆర్జీవీ చిత్రం
- టీడీపీ వ్యవస్థాపకుడిపై ప్రతిపక్ష వైసీపీ చిత్రం
- రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తీస్తున్నానని ప్రముఖ దర్శకుడు వర్మ ప్రకటించిన దగ్గర నుంచి మొదలైన చర్చ రోజురోజుకు వేడెక్కుతోంది తప్ప చల్లారడం లేదు. టీడీపీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్‌పై ప్రతిపక్ష పార్టీ వైసీపీ నేతల ఆధ్వర్యంలో సినిమా తెరకెక్కుతుండడం ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచింది. ఎన్నికలకు ఏడాది ముందు సినిమా తీస్తుండడం, వైసీపీ నేత రాకేశ్‌రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తుండడం, తాజాగా వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ బావమరిది బ్రదర్ అనిల్, ఆర్జీవీ ఓ హోటల్‌లో రహస్యంగా రెండు గంటలపాటు భేటీ కావడంతో సినిమా వెనక ఇంకేదో జరుగుతోందన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను రాకేశ్ నిర్మిస్తున్నారని వర్మ ప్రకటించిన తర్వాత రాజకీయ వర్గాలతోపాటు రాకేశ్ సొంత ప్రాంతమైన పలమనేరులో మరో విధమైన చర్చ ప్రారంభమైంది. ఆర్జీవీ వంటి పెద్ద దర్శకుడితో సినిమా నిర్మించేంత స్తోమత ఉందా? అని చర్చించుకుంటున్నారు. అందరినీ నమ్మించేందుకు వర్మ ఆయన ఇంటికి వెళ్లి సినిమా గురించి అక్కడ ప్రకటించారని చెబుతున్నారు. అయితే సినిమా నిర్మాణం వెనక మాత్రం మరెవరో ఉండి, తెర ముందు ఆయనను చూపిస్తుండవచ్చని అంటున్నారు. ఇక వైసీపీ ఎమ్మెల్యే రోజాకు తన సినిమాలో పాత్ర ఇస్తానని వర్మ ప్రకటించగా, ఏ పాత్రో ఆయన బయటపెట్టలేదు. అయితే అది కచ్చితంగా లక్ష్మీపార్వతి పాత్రే అయి ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది.