North korea: మరో క్షిపణి ప్రయోగానికి సిద్ధమైన ఉత్తర కొరియా.. ప్యాంగ్యాంగ్ సమీపంలో రెడీ!
- క్షిపణులకు అమెరికా వెస్ట్ కోస్ట్‌ను చేరుకునే సామర్థ్యం
- రెండు క్షిపణుల మోహరింపు
- శాటిలైట్ చిత్రాలను బయటపెట్టిన దక్షిణ కొరియా
అమెరికా, దక్షిణ కొరియాలు కలిసి వచ్చే వారం సంయుక్త నావికాదళ విన్యాసాలు చేపట్టనున్న తరుణంలో ఉత్తర కొరియా మరో క్షిపణి ప్రయోగానికి సిద్ధమవుతోంది. ప్యాంగ్యాంగ్ (రాజధాని) సమీపంలో ఇప్పటికే రెండు క్షిపణులను మోహరించి సిద్ధంగా ఉంచింది. హవసాంగ్-13, హవసాంగ్-14 బాలిస్టిక్ క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగించే అవకాశం ఉందని దక్షిణ కొరియాకు చెందిన ఓ వార్తా పత్రిక పేర్కొంటూ అందుకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను బయటపెట్టింది. ఈ రెండింటికీ యూఎస్ వెస్ట్ కోస్ట్‌ను చేరుకునే సామర్థ్యం ఉన్నట్టు చెబుతున్నారు. అయితే ఇది అంతర్గత వ్యవహారమంటూ దీనిపై వ్యాఖ్యానించేందుకు దక్షిణ కొరియా రక్షణ శాఖ ప్రతినిధి నిరాకరించారు. అయితే ఉత్తర కొరియా చర్యలపై ఓ కన్నేసి ఉంచినట్టు తెలిపారు.
మరోవైపు ఉత్తర కొరియా తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల మాట్లాడుతూ ఏదో ఒకటి చేసి కిమ్ జోంగ్ ఉన్‌కు అడ్డుకట్ట వేయాల్సిందేనని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. అణుదాడి తప్పదంటూ రోజుకో ప్రకటన చేస్తున్న ఉత్తర కొరియాకు దీటుగా బదులివ్వాలని అమెరికా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల కొరియా ద్వీపకల్పంపై అమెరికా బాంబర్లు చక్కర్లు కొట్టినట్టు తెలుస్తోంది.