nagarjuna sagar: సాగర్ కు కరవుదీరా వరద... 2.50 లక్షల క్యూసెక్కులు దాటిన ప్రవాహం
- సీజన్ లో అత్యధిక వరద ప్రవాహం
- వేగంగా నిండుతున్న నాగార్జున సాగర్
- 200 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు, నైరుతీ రుతుపవనాలు పోతూ పోతూ కురిపిస్తున్న వర్షాలు, అక్కడక్కడా ఏర్పడుతున్న క్యుములో నింబస్ మేఘాల పుణ్యమాని నాగార్జున సాగర్ జలాశయం శరవేగంగా నిండుతోంది. ఆల్మట్టి, జూరాల, శ్రీశైలం జలాశయాల నుంచి వచ్చిన నీరు వస్తున్నట్టుగా దిగువకు విడుదల చేస్తుండటంతో, ఈ ఉదయం సాగర్ వద్ద ఇన్ ఫ్లో 2,67,513 క్యూసెక్కులుగా నమోదైంది. గత రెండేళ్లలో సాగర్ కు ఒకేసారి ఇంత మొత్తంలో వరద నీటి ప్రవాహం నమోదుకావడం ఇదే తొలిసారి.
కాగా, మొత్తం 590 అడుగుల నీటి మట్టం ఉండే సాగర్ లో ప్రస్తుతం 545 అడుగులకు నీరు చేరింది. నీటి నిల్వ 200 టీఎంసీలను దాటింది. ఇదే వరద ప్రవాహం మరో పది రోజులు కొనసాగితే, ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుతుందని అధికారులు వెల్లడించారు. కాగా, ఆల్మట్టికి వస్తున్న వరద ప్రవాహం తగ్గినట్టు తెలుస్తోంది. శనివారం నాడు 50 వేల క్యూసెక్కులుగా ఉన్న ఆల్మట్టి వరద, నేటి ఉదయం 30 వేల క్యూసెక్కులకు పరిమితమైంది. శ్రీశైలం జలాశయానికి మరో ఐదు రోజుల పాటు వరద నీటి ప్రవాహం కొనసాగుతుందని నీటి పారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీశైలం జలాశయం ఏడు క్రస్ట్ గేట్లను ఎత్తి, 2.55 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతూ, డ్యామ్ లో 844 అడుగుల నీటి మట్టాన్ని నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు.