chester field: వర్జీనియాలో కాల్పులు... స్టేట్ వర్శిటీ మూసివేత... ఆ ప్రాంతంలోకి వెళ్లవద్దని పోలీసుల హెచ్చరిక!
- ఘటనలో ఓ వ్యక్తికి గాయాలు
- లోపలికి ఎవరూ వెళ్లవద్దని పోలీసుల హెచ్చరిక
- క్యాంపస్ కు ప్రమాదం లేదు
- ముందు జాగ్రత్తతోనే వర్శిటీ మూసివేత
- చెస్టర్ ఫీల్డ్ పోలీసుల ప్రకటన
అమెరికాలోని వర్జీనియా స్టేట్ యూనివర్శిటీలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఒంటరిగా సాయుధుడై వచ్చిన ఓ యువకుడు కాల్పులకు దిగినట్టు తెలుస్తోంది. శనివారం రాత్రి 8.35 (భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 7.05) గంటల సమయంలో కాల్పులు జరుగగా, దుండగుడు ఇంకా వర్శిటీ ప్రాంగణంలోనే ఉన్నాడని తెలుస్తోంది. ముందు జాగ్రత్త చర్యగా వర్శిటీని మూసివేసిన అధికారులు, అక్కడ ఎవరూ ఉండవద్దని, విద్యార్థులంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరారు.
వర్శిటీ లోపలికి ఎవరూ వెళ్లవద్దని హెచ్చరించారు. కాల్పుల ఘటనలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయని, అతనికి ప్రాణాపాయం లేదని చెస్టర్ ఫీల్డ్ పోలీసు విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. క్యాంపస్ కు ప్రమాదం ఏమీ లేకపోయినప్పటికీ, అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామని తెలిపింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి వుంది.