ins kiltan: అమ్ములపొదిలో కిల్తాన్... సబ్ మెరైన్లను గుర్తించి సర్వనాశనం చేస్తుంది!
- రేపు జాతికి అంకితం కానున్న ఐఎన్ఎస్ కిల్తాన్
- రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా...
- అత్యాధునిక పరిజ్ఞానంతో తయారైన కిల్తాన్
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మరో అత్యాధునిక యుద్ధ నౌక అతి త్వరలోనే భారత నావికాదళం అమ్ముల పొదిలోకి చేరనుంది. సముద్ర అంతర్భాగాల్లో దాగుండి, దాడులు చేసే సబ్ మెరైన్లను గుర్తించి వాటిని నాశనం చేసే శక్తిని సమకూర్చుకున్న 'ఐఎన్ఎస్ కిల్తాన్'ను ఈ నెల 16న కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ జాతికి అంకితం చేయనున్నారు.
కేంద్రం ప్రారంభించిన 'ప్రాజెక్టు - 28' లో భాగంగా నిర్మించ తలపెట్టిన నాలుగు యాంటీ సబ్ మెరైన్లలో ఇది మూడవది. ఇప్పటికే ఐఎన్ఎస్ కమోర్తా, ఐఎన్ఎస్ కద్మత్ నౌకలు నావికాదళానికి సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. 1971 ప్రాంతంలో భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం వచ్చినప్పుడు అరేబియా సముద్రంలో ఉంటూ దేశానికి సేవలందించి, 1987లో డీ కమిషన్ చేయబడిన 'కిల్తాన్' స్ఫూర్తిగా ఈ యుద్ధనౌకను తయారు చేసి ఆ పేరే పెట్టారు.
కమోర్తాతో పోలిస్తే మరిన్ని ప్రత్యేకతలు సంతరించుకున్న కిల్తాన్ ను, పూర్తిగా కార్బన్ ఫైబర్ కాంపోజిట్ పదార్థంతో తయారు చేశారు. 109 మీటర్ల పొడవు, 3,500 టన్నుల బరువుండే ఈ యుద్ధనౌక, గంటకు 25 నాటికల్ మైళ్ల వేగంతో దూసుకెళుతుంది. ఒకసారి ఇంధనాన్ని నింపుకుంటే, 3,450 నాటికల్ మైళ్లు ప్రయాణిస్తుంది. టోర్పెడోలు, ఏఎస్ డబ్ల్యూ రాకెట్లు, 76 ఎంఎం క్యారిబర్ మీడియం రేంజ్ గన్స్, క్లోజ్డ్ ఇన్ వెపన్స్ సిస్టమ్, మల్టీ బ్యారల్ గన్స్ సెన్సార్ సూట్లు దీనిలోని ప్రత్యేకతలు. శత్రువుల మిసైల్స్ దూసుకొస్తుంటే, వాటిని దారితప్పించే మిసైల్ డెకోయ్ రాకెట్లు, ఎయిర్ సర్వైవ్ లెన్స్ రాడార్ వ్యవస్థతో పాటు, ఫైటర్ హెలికాప్టర్లు దిగేందుకు వీలుంటుంది. ప్రధాన ఆయుధాల పరీక్షలో, ట్రయల్ రన్స్ లో విజయం సాధించిన కిల్తాన్ ను రేపు రక్షణ మంత్రి నావికా దళానికి అధికారికంగా అందించనుండగా, ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.