gauri lankesh: గౌరీ లంకేశ్ హంతకుల ఊహా చిత్రాలు ఇవే... పట్టిస్తే పది లక్షలు!
- సీసీటీవీ కెమెరా దృశ్యాల ఆధారంగా చిత్రాలు
- స్థానికులు ఇచ్చిన ఆధారాలతో తయారు చేసిన సిట్
- ఎవరు దొరికినా కేసు చిక్కుముడి వీడుతుందంటున్న పోలీసులు
బెంగళూరులో సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య జరిగి నెల రోజులు గడిచినా, హంతకులు ఎవరన్న విషయమై ఇంతవరకూ పోలీసులు ఓ నిర్ధారణకు రాలేకపోయారు. ఈ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు, సీసీటివీ ఫుటేజ్ లను, ఆ ప్రాంతంలోని ప్రజలను విచారించి తయారు చేసిన ఊహా చిత్రాలను మీడియాకు విడుదల చేశారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.
ఫోటోల్లోని వారి పోలికలతో ఎవరైనా కనిపిస్తే తమకు సమాచారాన్ని ఇవ్వాలని చెప్పారు. వారికి రూ. 10 లక్షల బహుమతిని అందిస్తామన్నారు. లంకేశ్ ఇంటికి సమీపంలో నివాసం ఉండేవారిని విచారించి, ఆపై తమ సాంకేతిక బృందాలతో వీటిని తయారు చేయించామని మొత్తం మూడు విభిన్న చిత్రాలను రూపొందించామని, వీరిలో ఏ ఒక్కరు దొరికినా కేసు చిక్కు ముడి వీడుతుందని అన్నారు.
హత్యకు కనీసం వారం రోజుల ముందు నుంచి అనుమానితులు బెంగళూరు నగరంలో ఉన్నారని, పలుమార్లు లంకేశ్ ఇంటి వద్దకు వెళ్లి వచ్చారని తెలిపారు. ఊహా చిత్రాల్లోని వారు నగరంలో ఎక్కడ దాక్కున్నా ప్రజలు పట్టివ్వాలని కోరారు. కాగా, వామపక్ష భావజాలమున్న జర్నలిస్టు లంకేశ్ (55)ను సెప్టెంబర్ తొలివారంలో ఆమె ఇంటిముందే దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.