yadiki: 20 ఏళ్లుగా మాయమైన యాడికి జలపాతం... ఇప్పుడు కనువిందు చేస్తోంది!
- 200 అడుగుల ఎత్తు నుంచి దుముకుతున్న నీరు
- అందాలను చూసేందుకు తరలివస్తున్న యువత
- రెండు దశాబ్దాల తరువాత యాడికి కొండలపై నుంచి జలపాతం
నేటి తరం అనంతపురం జిల్లా యువత కనీవినీ ఎరుగని అందం ఇప్పుడు కళ్లముందు సాక్షాత్కరించింది. శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండి గేట్లు వదిలిన దృశ్యం మూడేళ్ల తరువాత కనిపించగా, అనంతపురంలో దాదాపు 200 అడుగుల ఎత్తున ఉన్న యాడికి కొండలపై నుంచి జలపాతం కిందకు దుముకుతున్న దృశ్యం జిల్లా వాసులను విశేషంగా ఆకర్షిస్తోంది.
దాదాపు 20 సంవత్సరాల క్రితం ఈ జలపాతం కనిపించిందని, ఆ తరువాత వర్షాలు కురవక, జలపాతం దర్శనం ఇవ్వలేదని, తిరిగి గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండలపై నుంచి నీరు జారుతోందని ఇక్కడి స్థానికులు వెల్లడించారు. ఇక యాడికి జలపాతం దృశ్యాన్ని కనులారా వీక్షించేందుకు పెద్దఎత్తున యువతీ యువకులు వస్తున్నారు. దీంతో ఆ ప్రాంతం పర్యాటక శోభను సంతరించుకుంది.