us congress: ఇండియాలో పరిస్థితి బాగాలేదు... కంచ ఐలయ్య, గౌరీ లంకేశ్ లను ప్రస్తావించిన యూఎస్ కాంగ్రెస్!
- హరించుకుపోతున్న భావ ప్రకటనా స్వేచ్ఛ
- మాట్లాడితే చంపేస్తామంటున్నారు
- స్వయంగా హెచ్చరిస్తున్న ప్రభుత్వ పెద్దలు
- నెల రోజులైనా గౌరీ హంతకులను అరెస్ట్ చేయలేదు
- యూఎస్ కాంగ్రెస్ లో హెరాల్డ్ ఫ్రాంక్
ఇండియాలో భావ ప్రకటనా స్వేచ్ఛ హరించుకుపోతున్నదని అమెరికన్ ప్రతినిధుల సభ అభిప్రాయపడింది. సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య, ఆపై హైదరాబాద్ దళిత రచయిత కంచ ఐలయ్య ఉదంతాలను ప్రస్తావించిన, రిపబ్లికన్ ప్రతినిధి హెరాల్డ్ ట్రెంట్ ఫ్రాంక్స్... ఇప్పటికే జరిగిన ఓ హత్యను గానీ, మరో హత్య చేస్తామన్న బెదిరింపులను గానీ భారత్ ఎంతమాత్రమూ పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపించారు.
మాట్లాడే స్వేచ్ఛ నశిస్తోందని, ఇంటర్నెట్ మాధ్యమంగా తమ అభిప్రాయాన్ని చెప్పిన వారు సైతం శిక్షలకు గురవుతున్నారని ఆరిజోనా 8వ జిల్లాకు ప్రతినిధిగా ఉన్న హెరాల్డ్ ఆరోపించారు. నెల రోజుల క్రితం తన ఇంటిముందే ఓ జర్నలిస్టు దారుణంగా హత్యకు గురైతే, నిందితులను ఇప్పటివరకూ అరెస్ట్ చేయలేదని, ఏ మాత్రం భయంలేకుండా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్న ఘటనలు ఇండియాలో జరుగుతున్నాయని అన్నారు.
రాష్ట్రాల పరిధిలో అధికారం కోసం జరుగుతున్న వర్గ పోరులో భాగంగానే ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. గోవింద్ పనేసర్, ఎంఎం కాల్ బుర్గి, నరేంద్ర దబోల్కర్ తదితరుల హత్యలనూ ఆయన ప్రస్తావించారు. ఇండియాలో ఓ కులం సామాజిక పెత్తనం గురించి రాసిన ఐలయ్య అనే ప్రొఫెసర్ ను బీజేపీ మిత్రపక్షంలోని ఓ ఎంపీ బహిరంగంగా ఉరి తీస్తానని హెచ్చరించాడని ఫ్రాంక్ గుర్తు చేశారు. ప్రజా ప్రతినిధులే భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకుంటున్నారని, దీన్ని అడ్డుకునేందుకు భారత్ పై ఎటువంటి ఒత్తిడి పెట్టాలన్న విషయమై చర్చించాల్సిన అవసరం ఉందని యూఎస్ కాంగ్రెస్ ను ఆయన కోరారు.