jagan: జగన్ స్వయంగా మాట్లాడినా మెత్తబడని బుట్టా రేణుక!
- మనసు మార్చుకోని బుట్టా రేణుక
- కార్యకర్తల ఒత్తిడంటూ తప్పించుకునే యత్నం
- కర్నూలులో వైకాపా దాదాపు ఖాళీ
కర్నూలు పార్లమెంట్ సభ్యురాలు, వైకాపా నేత బుట్టా రేణుక, తెలుగుదేశం పార్టీలోకి జంప్ చేసేందుకే నిర్ణయించుకున్నారు. ఆమెను ఆపాలని భావించిన వైకాపా అధినేత వైఎస్ జగన్, స్వయంగా మాట్లాడినా ఆమె మనసు మార్చుకోలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్టీని వీడవద్దని, భవిష్యత్తు వైకాపాదేనని జగన్ చెప్పగా, తన పరిస్థితిని వివరించిన రేణుక, తాను నిస్సహాయ స్థితిలో ఉన్నట్టు స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. ఏ నిర్ణయం తీసుకున్నా కార్యకర్తల నుంచి వస్తున్న ఒత్తిడితోనేనని తెలిపినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
కాగా, 2014 ఎన్నికల్లో కర్నూలు జిల్లాను వైకాపా దాదాపు క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాలనూ ఆ పార్టీ గెలుచుకుంది. కర్నూలు నుంచి బుట్టా రేణుక, నంద్యాలలో ఎస్పీవై రెడ్డి విజయం సాధించారు. తొలుత ఎస్పీవై రెడ్డి వైకాపాకు హ్యాండిచ్చి టీడీపీలో చేరగా, ఆపై ఇప్పుడు బుట్టా కూడా అదే దారిలో నడుస్తున్నారు. ఎంపీల విషయం అటుంచితే, ఇప్పటికే కర్నూలు జిల్లాలోని పలువురు వైకాపా ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించగా, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సైతం టీడీపీలో చేరనున్నారని వార్తలు వస్తున్నాయి.