sj surya: ఆకలి .. అవమానం కలిగించే బాధ ఎలా ఉంటుందో చూశాను :ఎస్.జె.సూర్య
- చిన్నప్పటి నుంచి సినిమాలపైనే ధ్యాస
- అందువల్లనే పెద్దగా చదువబ్బ లేదు
- ఏదో సాధించాలనే చెన్నై కి చేరుకున్నా
- అజిత్ మొదటి అవకాశం ఇచ్చాడు
తెలుగు .. తమిళ భాషల్లో నటుడిగా .. దర్శకుడిగా ఎస్.జె. సూర్యకు మంచి గుర్తింపు వుంది. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తాను ఈ స్థాయికి చేరుకోవడానికి పడిన కష్టాలను గురించి ప్రస్తావించారు. చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి అనీ .. అందువలన చదువు పెద్దగా అబ్బలేదని చెప్పారు. అందువలన చెన్నైకి చేరుకొని సినిమాల్లో అవకాశాల కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేయడం మొదలెట్టానని అన్నారు.
ఆ సమయంలో అద్దె కట్టలేక ఇబ్బంది పడేవాడిననీ .. ఆకలి బాధను తట్టుకోలేకపోయేవాడినని చెప్పారు. సినిమాల్లో అవకాశాలు వచ్చేవరకూ రోజు గడవాలి కనుక, హోటల్లో సర్వర్ గా పనిచేశాననీ .. బల్లలు తుడిచానని అన్నారు. అనుకున్నది సాధించడం కోసం అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రముఖ దర్శకుల దగ్గర చేరాననీ, వాళ్ల లగేజీలు మోశానని చెప్పారు. తనలోని టాలెంట్ ను గుర్తించి హీరో అజిత్ .. 'వాలి' సినిమాతో అవకాశం ఇవ్వడంతో, దర్శకుడిగా తన కెరియర్ మలుపు తిరిగిందని చెప్పుకొచ్చారు.