amezon: రిలయన్స్ దూసుకొస్తోంది.. ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లకు ఇక పెద్ద పోటీనే!
- ఈ-కామర్స్ కంపెనీలకు షాకివ్వనున్న రిలయన్స్ రిటైల్
- జియో విస్తరిస్తుండటమే కారణం
- చిన్న చిన్న వ్యాపారులకు వరంగా మారనున్న జియో
- విస్తరణ బాటలో మిగతా కంపెనీలకన్నా ముందు
- అంచనా వేసిన ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్ దాస్ పాయ్
ఇప్పటికే టెలికం రంగంలోకి వచ్చీ రాగానే ఎయిర్ టెల్, ఐడియా వంటి దిగ్గజ సంస్థలకు షాకిచ్చిన రిలయన్స్, ఇప్పుడు ఈ-కామర్స్ రంగంలో విస్తరణ దిశగా ఉరుకులు పెడుతోంది. ఇదే విషయాన్ని ప్రస్తావించిన ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ టీవీ మోహన్ దాస్ పాయ్, ఫ్లిప్ కార్ట్, అమెజాన్ సంస్థలు చాలా జాగ్రత్తగా ఉండాలని, రిలయన్స్ రిటైల్ నుంచి వాటికి పెను పోటీ ఎదురు కానుందని అంచనా వేశారు. జియో గ్రామగ్రామానికీ విస్తరిస్తుండటమే ఇందుకు కారణమని, జియో విస్తరణ ఆన్ లైన్ రిటైల్ సంస్థలకు సవాలేనని అభిప్రాయపడ్డారు.
వచ్చే సంవత్సరం ఈ-కామర్స్ విభాగంలో ఏకీకరణ తెరపైకి వస్తుందని, చిన్న కంపెనీలు మూతపడి, కొన్ని సంస్థలు మాత్రమే పోటీలో మిగిలుంటాయని పేర్కొంటారు. రిలయన్స్ జియో దేశమంతా విస్తరిస్తూ, అన్ని చిన్న కంపెనీలకూ చేరువ అవుతోందని, చిన్న వ్యాపారుల సరఫరాను పెంచడం ద్వారా, వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తూ, రిలయన్స్ విస్తృతం కానుందని, మిగతా సంస్థలతో పోలిస్తే, ఉత్తమ పంపిణీ సంస్థగా నిలిచి, గ్రామ స్థాయిలో ప్రాతినిధ్యాన్ని పెంచుకోనుందని పాయ్ అంచనా వేశారు.
ఇక స్టార్టప్ సంస్థలపై తన అభిప్రాయాన్ని తెలుపుతూ, పెద్ద కంపెనీలు చాలా వరకూ అంకుర సంస్థల్లో పెట్టుబడులు పెడుతున్నాయని, వచ్చే సంవత్సరం మరిన్ని స్టార్టప్ కంపెనీలు వస్తాయని అన్నారు. కృత్రిమ మేధస్సు, మెషీన్ లెర్నింగ్ విభాగం, అగ్రిటెక్, మెడికల్ టెక్నాలజీ విభాగాల్లో స్టార్టప్ లు అత్యధికంగా వస్తాయని వెల్లడించారు. గత సంవత్సరం కొత్త కంపెనీల్లో 8 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేసిన ఆయన, ఈ సంవత్సరం మరిన్ని పెట్టుబడులు రానున్నాయని వెల్లడించారు. ఇక పెద్ద సంస్థలు మూలధనాన్ని కుమ్మరిస్తుండటం చిన్న కంపెనీలకు ఇబ్బందులను కలిగించనుందని మోహన్ దాస్ పాయ్ పేర్కొన్నారు.