telangana: పుస్తకాల బ్యాగ్ బరువు మోయలేక విద్యార్థిని మృతి

  • 12 కేజీల బరువైన బ్యాగుతో 3 అంతస్తుల మెట్లు ఎక్కిన బాలిక
  • బాల్కనీలో కుప్పకూలి, అపస్మారక స్ధితిలోకి వెళ్లింది 
  • ప్రథమ చికిత్స అనంతరం ఎంజీఎం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి

స్కూలు పుస్తకాల బ్యాగు మోయలేక ఓ విద్యాకుసుమం నేలరాలిన దారుణమైన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... వరంగల్‌ లోని కరీమాబాద్‌ లోని తోట్లవాడకు చెందిన పవుడాల కుమారస్వామి, శోభ దంపతులకు ముగ్గురు సంతానం. వారంతా స్థానిక కౌటిల్య హైస్కూల్‌ లో చదువుతున్నారు. పెద్దకుమార్తె శ్రీవర్షిత (14) 9వ తరగతి చదువుతోంది. రోజులాగే స్కూల్ కు పుస్తకాల బ్యాగుతో వెళ్లింది. మూడో అంతస్తులోని తరగతి గదిలోకి వెళ్లేందుకు 12 కేజీల బరువున్న బ్యాగుతో మెట్లెక్కింది. తీరా తరగతి గదికి వెళ్లేలోపు బాల్కనీలో ఆమె కుప్పకూలిపోయింది.

వెంటనే అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. పాఠశాల నిర్వాహకులు ఆమెను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసి, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అనంతరం ఆ ఆసుపత్రి నుంచి వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలిస్తుండగా, ప్రాణాలు విడిచింది. దీంతో శ్రీవర్షిత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

పుస్తకాల బ్యాగు అతి బరువు, తరగతి గది మూడో అంతస్తులో వుండటమే విద్యార్థిని మృతికి కారణమని పలువురు అభిప్రాయపడుతుండగా, విద్యాశాఖ నిబంధనల ప్రకారం 9, 10 తరగతుల విద్యార్థుల పుస్తకాల బ్యాగు బరువు 6 కేజీల లోపే ఉండాల్సి ఉంటుంది. కాగా, నిబంధనలకు విరుద్ధంగా బాలిక బండెడు పుస్తకాలు మోయాల్సి రావడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

  • Loading...

More Telugu News