pranab mukherjee: గాంధీ కుటుంబసభ్యులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ప్రణబ్ ముఖర్జీ
- కాంగ్రెస్ బాధ్యతలను చేపట్టే లక్షణాలు రాహుల్ కు ఉన్నాయి
- ఇందిర, రాజీవ్ ల నాయకత్వ లక్షణాలు రాహుల్ కు వచ్చాయి
- పరిస్థితులే ఇందిర, రాజీవ్ లను గొప్ప నాయకులుగా తీర్చిదిద్దాయి
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మళ్లీ క్రియాశీలకంగా మారారు. కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా, రాహుల్ గాంధీకి రాజగురువుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా 'సంకీర్ణ సంవత్సరాలు 1996-2012' పేరుతో తన ఆత్మకథ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇదే సమయంలో ఓ జాతీయ ఛానెల్ కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో గాంధీ కుటుంబసభ్యులకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీని నడిపించగలిగిన శక్తిసామర్థ్యాలు రాహుల్ గాంధీకి ఉన్నాయని ఈ సందర్భంగా ప్రణబ్ అన్నారు. మార్పును కోరుకునే తత్వం, పరిస్థితులకు తగ్గట్టు వ్యవహరించే గుణం రాహుల్ లో పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. రాహుల్ నానమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్ గాంధీలు ఇద్దరూ భారత ప్రధానులుగా పని చేశారని... వారిని నాయకులుగా ఎవరూ తయారు చేయలేదని అన్నారు.
టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు బొమ్మను తయారు చేసినట్టు ఇందిరను ఎవరూ తయారు చేయలేదని చెప్పారు. పరిస్థితులే వారిని గొప్ప నేతలుగా తీర్చిదిద్దాయని తెలిపారు. ఇందిర నాయకత్వ లక్షణాలు రాజీవ్ కు వచ్చాయని... ఇప్పుడు రాహుల్ లోనూ అవే నాయకత్వ లక్షణాలు ఉన్నాయని చెప్పారు. త్వరలోనే కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతలను రాహుల్ స్వీకరించబోతున్న సంగతి తెలిసిందే.