diwali: `దివాలీ ముబారక్` అని ట్వీట్ చేసిన కెనడా ప్రధాని... సవరణలు చేసిన హిందూ నెటిజన్లు
- ఒట్టావాలో ఘనంగా దీపావళి వేడుకలు
- పాల్గొన్న జస్టిన్ త్రెదో
- భారత పండగలన్నింటికీ విషెస్ చెప్పే ప్రధాని
భారతీయులు ప్రీతిపాత్రంగా జరుపుకునే దీపావళి పండగకి కెనడా ప్రధాని జస్టిన్ త్రెదో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఓ ట్వీట్ చేశారు. `దివాలీ ముబారక్... ఒట్టావాలో ఇవాళ రాత్రి వేడుకలు జరుపుకుంటున్నాం` అని ఆయన ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌కు హిందూ నెటిజన్లు కొన్ని సవరణలు చేశారు. దివాలీ హిందువుల పండగని, దానికి `ముబారక్` అనే అరబిక్ పదం కాకుండా `బఢాయి` అనే హిందీ పదం వాడాలని సూచించారు. దీపావళి విషెస్ అలా చెప్పకూడదని `శుభ్ దివాలీ` అని చెప్పాలని సలహాలు కుమ్మరించారు.
అయితే కెనడాకు ప్రధాని అయిన జస్టిన్ శుభాకాంక్షలు చెప్పడమే ఎక్కువ అనుకుంటే, అందులో సవరణలు చేయడమేంటని కొంతమంది నెటిజన్లు ప్రశ్నించారు. `ముబారక్` అనే పదం బూతు పదమేం కాదని, భాష మారినంత మాత్రాన చెప్పిన వారి భావం మారదని వారు హితబోధ చేశారు. ఏదేమైనా, కెనడాలో భారతీయ పండగలు జరపడం, వాటికి వారి ప్రధాని విషెస్ చెప్పడం నిజంగా గొప్ప విషయమే!