aadhar: ఉద్యోగ నియామకాల విషయంలో ఆధార్ పై ఆధారపడుతున్న కంపెనీలు!
- దరఖాస్తులో ఆధార్ సంఖ్య తప్పనిసరి
- వారం రోజులు జరిగే వెరిఫికేషన్ పావు గంటలో
- తగ్గిన కంపెనీల నియామకాల ప్రక్రియ సమయం
ఇప్పటికే ప్రతి సంక్షేమ పథకానికి, సబ్సిడీ పొందేందుకు, విమానం, రైలు తదితర టికెట్ల బుకింగ్ కు తప్పనిసరై, భారతీయ పౌరుడినని చెప్పుకునేందుకు ఆధారంగా మారిన ఆధార్ కార్డు లేకుంటే ఇకపై ఉద్యోగాలు కూడా రావేమో!... ఎందుకంటే, ఇప్పటికే పలు కంపెనీలు తాము కొత్తగా విధుల్లోకి ఉద్యోగులను తీసుకోవాలని భావిస్తున్న వేళ ఆధార్ డేటా బేస్ పైనే ఆధారపడుతున్నాయి.
గతంలో ఓ ఉద్యోగి గత చరిత్రపై విచారించేందుకు వారం రోజుల సమయం పడుతుండగా, ఆధార్ డేటాబేస్ సహకారంతో కేవలం పావు గంటలో ఉద్యోగి ప్రవర్తన, గతంలో పనిచేసిన ఆఫీసులు, పోలీసు కేసులు తదితరాలపై సమాచారాన్ని అందుకుంటున్నామని అందువల్లే ఆధార్ డేటా బేస్ వాడకం కంపెనీల్లో పెరిగిందని విశ్లేషకులు అంటున్నారు.
ఇంటర్వ్యూ సమయాల్లో రెసిడెన్స్ ప్రూఫ్ వంటి డాక్యుమెంట్లు చూపించే అవసరం లేకుండా ఆధార్ చేసిందని ప్రముఖ రిక్రూట్ మెంట్ సేవల సంస్థ 'క్వెస్' పేర్కొంది. గడచిన నాలుగు నెలల్లో 30 వేల మంది ఉద్యోగుల వెరిఫికేషన్ ఆధార్ సాయంతో పూర్తయిందని, ప్రతి కంపెనీ తమ దరఖాస్తులో ఆధార్ నెంబర్ ను తప్పనిసరి చేశాయని క్వెస్ వ్యవస్థాపక సీఈఓ అజిత్ ఇసాక్ వెల్లడించారు. 40 మంది ఉద్యోగులు వారం రోజుల పాటు శ్రమించి తెలుసుకునే విషయాలను ఆధార్ పది నిమిషాల్లోనే అందిస్తోందని ఆయన అన్నారు.
గురుగ్రామ్ కేంద్రంగా నియామకపు సేవలందిస్తున్న 'ఆత్ బ్రిడ్జ్' సైతం ఇదే విధమైన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఉద్యోగులను తీసుకునే విధానం పూర్తిగా ఆధార్ పై ఆధారపడుతోందని సంస్థ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఇస్తారన్న అనుమానం లేకుండా పోయిందని, ఆధార్ వెరిఫికేషన్ లో క్లియరైతే 70 శాతం అర్హత సాధించినట్టేనని రిక్రూట్ మెంట్ సేవల సంస్థ 'బెటర్ ప్లేస్' సీఓఓ సౌరభ్ టాండన్ వ్యాఖ్యానించారు.