sreesanth: శ్రీశాంత్‌కు షాకిచ్చిన కేరళ హైకోర్టు.. తీర్పుపై మండిపడిన టీమిండియా బౌలర్!
- అదో అత్యంత చెత్త తీర్పు అని ఆగ్రహం
- మిగతా 13 మంది పరిస్థితి ఏమిటని నిలదీత
- న్యాయం జరిగే వరకు పోరాడతానన్న కేరళ స్పీడ్‌స్టర్
కేరళ హైకోర్టుపై టీమిండియా బౌలర్, కేరళ స్పీడ్‌స్టర్ శ్రీశాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తీర్పు పరమ చెత్తగా ఉందని ట్వీట్ చేశాడు. ఇప్పటి వరకు వచ్చిన తీర్పుల్లో ఇదే అత్యంత చెత్త తీర్పు అని పేర్కొంటూ తన కోపాన్ని బయటపెట్టాడు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్‌పై ఆరోపణలు రావడంతో బీసీసీఐ అతడిపై జీవితకాల నిషేధం విధించింది. ఈ నిషేధాన్ని కొనసాగించాలంటూ మంగళవారం కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది.
శ్రీశాంత్‌పై ఉన్న నిషేధాన్ని కొట్టివేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును బీసీసీఐ సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం సింగిల్ జడ్జి బెంచ్ తీర్పును కొట్టివేసింది. నిషేధాన్ని కొనసాగించాల్సిందేనని స్పష్టం చేసింది. కోర్టు తీర్పుపై శ్రీశాంత్ మండిపడ్డాడు. ఇదో చెత్త తీర్పు అని ట్వీట్ చేశాడు. తనకేమైనా ప్రత్యేక రూల్ ఉందా? నిజమైన దోషులను శిక్షించరా? అన్ని ప్రశ్నించాడు. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ జట్ల గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించాడు. అలాగే లోధా నివేదికలో పేర్కొన్న 13 మంది పరిస్థితి ఏమిటని నిలదీశాడు. అయితే తాను నిర్దోషిగా బయటపడతానన్న నమ్మకం తనకు ఉందని, న్యాయం జరిగే వరకూ పోరాడతానని శ్రీశాంత్ స్పష్టం చేశాడు.