mock drill: మాక్ డ్రిల్: ‘పోలవరం’ వద్ద వీఐపీలను కిడ్నాప్ చేసిన పాక్ ఉగ్రవాదులు.. క్షేమంగా విడిపించిన పోలీసులు.. అంతా ఉత్తదే!
- పోలవరం వద్ద ఎదురు కాల్పులు
- ఇద్దరు ఉగ్రవాదులు హతం.. ఒకరు బందీ
- మాక్‌డ్రిల్ అంటూ పోలీసుల ప్రకటన
పోలవరం ప్రాజెక్టు వద్ద మంగళవారం కిడ్నాప్.. పోలీసుల రంగప్రవేశం.. ఎదురు కాల్పుల సీన్ కనిపించింది. ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన ఇద్దరు వీఐపీలను పాకిస్థాన్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఎస్పీ రవిప్రకాశ్ ఆదేశాలతో ఏఆర్ అదనపు ఎస్పీ మహేష్ కుమార్ రంగంలోకి దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను స్పెషల్ పార్టీ పోలీసులు అణువణువూ గాలించారు.
తీవ్రవాదులను గుర్తించిన పోలీసులు ఒక్కసారిగా వారిపై దాడికి దిగారు. ఉగ్రవాదులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. దీంతో ఆ ప్రాంతం కాల్పులతో దద్దరిల్లింది. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన పోలీసులు మరొకరిని బందీగా పట్టుకున్నారు. వారి చెర నుంచి వీఐపీలను రక్షించారు. ఏం జరుగుతోందో తెలియక అక్కడున్నవారు అయోమయం చెందగా ఇదంతా ‘మాక్‌డ్రిల్’లో భాగమని పోలీసులు ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరులోని జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్లో ఈ మాక్‌డ్రిల్‌ను నిర్వహించారు. ఎస్పీ రవిప్రకాష్ పర్యవేక్షణలో ఈ మాక్‌డ్రిల్‌ను నిర్వహించారు.