deepavali: ఈ దీపావళిని మానవత్వంతో జరుపుకొందాం.. సిమ్రన్ `వీడియో సందేశం
- సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నటి
- తమిళం, ఆంగ్ల భాషల్లో వీడియో
- ఇతరులకు ఇబ్బంది కలగకుండా పండగ జరుపుకోవాలని వినతి
ఈ దీపావళిని కాలుష్య రహిత, శబ్ద రహిత దీపావళిగా జరుపుకోవాలని ప్రముఖులు ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఆ బాటలోనే నటి సిమ్రన్ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియో విడుదల చేసింది. తన సోషల్ మీడియా ఖాతాల్లో ఈ వీడియోను సిమ్రన్ పోస్ట్ చేసింది. తమిళ, ఆంగ్ల భాషల్లో విడుదల చేసిన ఈ వీడియోలో ఇతరులకు ఇబ్బంది కలగకుండా పండగ జరుపుకోవాలని సిమ్రన్ విన్నవించుకుంది.
`కొందరి ఆనందం మరొకరికి బాధ కలిగించొచ్చు. ఒకరి మరణం మరొకరికి జీవం పోస్తుంది. ఒకరికి వృథా అనిపించేది మరొకరికి విలువైనది అవుతుంది. ఒకరి ఆహారం మరొకరికి విషం కావచ్చు. ఒకరికి శబ్దం అనిపించేది మరొకరికి సంగీతం అవుతుంది. మనం ఉండే వీధుల్లో ఇళ్లు, సైకిళ్లు, కార్లు, బైకులు, పిల్లులు, కుక్కలు తిరుగుతుంటాయి. రోడ్లపై కొందరు నడుస్తుంటారు, తింటుంటారు, నిద్రిస్తుంటారు. బాణసంచాను రోడ్లపై కాలిస్తే చాలా ప్రమాదాలు జరుగుతాయి. యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉంటుంది. జంతువులు భయపడతాయి. కాబట్టి బాణసంచా కాల్చాలనుకుంటే ఇతరులకు నష్టం వాటిల్లకుండా వాటిని ఖాళీ ప్రదేశాలకు తీసుకెళ్లి సెలబ్రేట్ చేసుకుందాం. ఈ దీపావళిని మానవత్వంతో జరుపుకొందాం` అని సిమ్రన్ వీడియోలో చెప్పారు.