white house: శ్వేతసౌధంలో ఘనంగా దీపావళి వేడుకలు... వీడియో ఇదిగో!
- పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
- వేడుకలో భారత అమెరికన్ అధికారులు
- వీడియో షేర్ చేసిన ట్రంప్
అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ ప్రారంభించిన వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకల సంప్రదాయానికి గత అధ్యక్షుడు ఒబామా వన్నె తీసుకువచ్చారు. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అధ్యక్షసౌధంలో అంగరంగ వైభవంగా జరిగిన దీపావళి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. శ్వేతసౌధంలోని ఓవల్ ఆఫీస్‌లో భారత అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ సభ్యులతో కలిసి ట్రంప్ దీపాలను వెలిగించారు. ఐరాసకు అమెరికా రాయబారి నిక్కీ హేలీ, సెంటర్ ఫర్ మెడికేర్ అడ్మినిస్ట్రేటర్ సీమా వర్మ, యూఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ ఛైర్మన్ అజిత్ పాయ్ తదితర భారత అమెరికన్లు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకలకు సంబంధించిన వీడియోను ట్రంప్ తన ఫేస్బుక్ ఖాతాలో షేర్ చేశారు.
‘దీపావళి వేడుకల్లో పాల్గొనడం చాలా గర్వంగా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని నిర్మించిన గొప్ప ప్రజలు భారతీయులు. ఆ దేశ ప్రధాని మోదీతో ఉన్న బలమైన సంబంధాలకు నేను చాలా విలువిస్తున్నాను. మన భారత-అమెరికన్ కమ్యూనిటీ, అమెరికా ఉన్నతి కోసం ఎంతో కృషి చేస్తోంది. అమెరికాలో ఉండే ప్రతి ఒక్కరికీ, హిందువులకు దీపావళి శుభాకాంక్షలు. మీ డొనాల్డ్ ట్రంప్’ అని ఆయన పోస్ట్ చేశారు.