deepika padukone: రాజ్‌పుత్ కమ్యూనిటీపై విరుచుకుపడ్డ దీపికా పదుకొనే!
- రంగోలీ ఆర్టిస్ట్ కరణ్‌పై జరిగిన దాడిని ఖండించిన నటి
- డ్రాయింగ్‌ని నాశనం చేయడంపై అసహనం
- చర్య తీసుకోవాలని కోరిన దీపిక
వరుస ట్వీట్లతో బాలీవుడ్ `పద్మావతి` దీపికా పదుకొనే రాజ్‌పుత్ కమ్యూనిటీ నాయకులపై విరుచుకుపడింది. రంగోలీ ఆర్టిస్ట్ కరణ్ కె ముగ్గును చెరిపేయడంపై ఆమె మండిపడింది. తన చిత్రం `పద్మావతి` ఆదర్శంగా సూరత్‌లోని ఓ షాపింగ్‌మాల్ వద్ద కరణ్ ముగ్గు వేశాడు. ఈ ముగ్గులో దీపికా పదుకొనే `పద్మావతి` లుక్‌ను డిజైన్ చేశాడు. ఇందుకోసం ఆయన 48 గంటలు కష్టపడ్డాడు. డ్రాయింగ్ వేయడం పూర్తయిన మూడు గంటలకే `జై శ్రీరాం` అనుకుంటూ కొంతమంది వచ్చి ముగ్గును చెరిపివేశారు. వారిపై అసహనం వ్యక్తం చేస్తూ దీపికా ట్వీట్లు చేసింది. `కరణ్ రంగోలీపై జరిగిన దాడి నిజంగా అమానుషం. ఎవరు వీళ్లంతా? ఇలాంటి వారిని ఇంకెంతకాలం సహించాలి? చట్టాలను వారి చేతిలోకి తీసుకుని మన స్వేచ్ఛా హక్కు మీద దాడి చేయడం ఏంటి? దీనికి చరమగీతం పాడాలి. స్మృతీ ఇరానీ ఏదైనా చర్య తీసుకోండి` అని దీపికా ట్వీటింది.
సినిమాలో ఏదైనా తప్పుగా చూపించినట్లు తెలిస్తే `పద్మావతి` చిత్ర ప్రదర్శనను అడ్డుకుంటామని శ్రీ రాజ్‌పుత్ కర్నీ సేన ఎప్పట్నుంచో చెబుతోంది. వారిని ముందుగా సినిమా చూడాలని చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ కోరారు. అయితే ముందు చరిత్రకారులకు చూపించండి... వారు చెబితే నమ్ముతామని శ్రీ రాజ్‌పుత్ కర్నీ సేన తెలిపింది. అయితే నిర్మాతల పక్షం నుంచి దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. డిసెంబర్ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.