bihar: మెరిట్ స్టూడెంటును ఫెయిల్ చేసినందుకు 5 లక్షలు పరిహారం ఇవ్వండి...పాట్నా హైకోర్టు సంచలన తీర్పు!
- పదో తరగతి పరీక్షల వాల్యూషన్ లో నిర్లక్ష్యం వహించిన బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు
- మెరిట్ స్టూడెంట్ ను ఫెయిల్ చేసేసిన వైనం
- హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థిని
- టీచర్లది తప్పని తేలడంతో పరిహారం విధించిన న్యాయస్థానం
విద్యార్థినిని తీవ్రక్షోభకు గురి చేశారు కనుక ఐదు లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలంటూ బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డును ఆదేశిస్తూ పాట్నా హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. దాని వివరాల్లోకి వెళ్తే...బీహార్ లో పదోతరగతి పరీక్షలు రాసిన ప్రియాంక సింగ్ కు ఫలితాలు ప్రతికూలంగా వచ్చాయి. దీంతో మెరిట్ స్టూడెంట్ అయిన ప్రియాంక సింగ్ ఆశ్చర్యపోయింది. మార్కుల జాబితా వచ్చిన తరువాత తనకు వచ్చిన మార్కులు చూసి షాక్ తింది. తాను పరీక్షలు బాగా రాసినా తనకు తక్కువ మార్కులు వేశారంటూ హైకోర్టును ఆశ్రయించింది.
దీంతో ఆమె జవాబు పత్రాలను రీ వాల్యూయేషన్ చేశారు. వంద మార్కులకు జరిగిన సంస్కృతం పరీక్షలో తొలుత ఆమెకు 9 మార్కులు రాగా, రీవాల్యూయేషన్ అనంతరం 80 మార్కులు వచ్చాయి. అలాగే సైన్స్ లో 80 మార్కులకు 29 మార్కులు రాగా, రీ వాల్యూయేషన్ అనంతరం 61 మార్కులు వచ్చాయి. దీంతో గతంలో పరీక్షా పత్రాలు సరిగ్గా వాల్యూ చేయలేదని స్కూల్ బోర్డు అంగీకరించింది. దీంతో యువతిని మానసిక క్షోభకు గురిచేశారని, యువతి విద్యా సంవత్సరాన్ని నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు, 5 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని బోర్డును ఆదేశించింది.