america: షాకింగ్ న్యూస్...ప్యాంగ్యాంగ్ కు క్షిపణులు తరలిస్తున్న ఉత్తరకొరియా!
- రాజధాని ప్యాంగ్యాంగ్ కు క్షిపణులు తరలిస్తున్న ఉత్తరకొరియా
- దక్షిణకొరియాతో కలిసి నేవీ డ్రిల్స్ చేస్తున్న అమెరికా
- ఎప్పుడేం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్న ప్రపంచ దేశాలు
అమెరికా, ఉత్తరకొరియా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైతే, అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్న నేపథ్యంలో బయటపడ్డ శాటిలైట్ చిత్రాలు మరింత ఆందోళనను పెంచుతున్నాయి. తాజాగా వెలువడ్డ శాటిలైట్ చిత్రాల్లో ఉత్తరకొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ సమీపానికి క్షిపణులను తరలిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
రాజధాని పరిసరాల్లో వాటిని మోహరింపజేసేందుకే వాటిని తరలిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఊహించని సమయంలో ఊహకందని దాడులతో విరుచుకుపడతామని అమెరికాను కిమ్ జాంగ్ ఉన్ తీవ్రంగా హెచ్చరించారు. అయితే ‘మొదటి బాంబు పడేవరకు’ దౌత్యపరమైన చర్చల కోసమే తాము ప్రయత్నిస్తామని అమెరికా చెప్పిన నేపథ్యంలో అక్కడ ఎప్పుడేం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా, కొరియా ద్వీపకల్పంలో దక్షిణ కొరియాతో కలిసి అమెరికా భారీ ఎత్తున డ్రిల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.