Diwali: ములాయం కుటుంబాన్ని ఒక్కటి చేసిన దీపావళి!
- అఖిలేష్‌తో కలిసి పండుగ చేసుకున్న ములాయం, శివ్‌పాల్
- విభేదాలు తొలగిపోయి ఒక్కటయ్యామన్న ములాయం
- 2019 ఎన్నికల కోసం పార్టీని బలోపేతం చేస్తామని ప్రకటన
దీపావళి పర్వదినం ములాయం ఇంట్లో కొత్త వెలుగులు నింపింది. తండ్రీకొడుకుల మధ్య నెలకొన్న మనస్పర్థలకు చెక్ పెట్టింది. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ మూల పురుషుడు అయిన ములాయం సింగ్ యాదవ్, సోదరుడు శివపాల్ యాదవ్‌తో కలిసి గురువారం కుమారుడు అఖిలేష్ యాదవ్ ఇంటికి వెళ్లారు. ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత బాబాయ్, అబ్బాయ్, తండ్రి.. ముగ్గురు కలుసుకోవడం ఇదే తొలిసారి.
తొలుత ములాయం సైఫైలోని కుమారుడి ఇంటికి చేరుకుని నేతలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత కాసేపటికే శివ్‌పాల్ అక్కడికి చేరుకున్నారు. బాబాయ్ శివ్‌పాల్‌ను ఆహ్వానించిన అఖిలేశ్ ఆయన పాదాలకు నమస్కరించారు. శివ్‌పాల్ ఆయనను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఇతర నేతలతో కలిసి 2019 ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ‘మిషన్-2019’ను తెరపైకి తెచ్చారు.
దీపావళితో కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయాయని ములాయం పేర్కొన్నారు. పార్టీ, కుటుంబం ఒక్కటయ్యాయన్నారు. అందరం కలిసి దీపావళిని జరుపుకున్నట్టు చెప్పారు. అందరం కలిసి పార్టీని మరింత ఉన్నత స్థానంలోకి తీసుకెళ్తామని ఈ సందర్భంగా ములాయం వివరించారు.