Chamara Kapugedara: మైదానంలో పెను ప్రమాదం నుంచి బయటపడిన శ్రీలంక క్రికెటర్!
- కీపర్ విసిరిన బంతిని గుర్తించకపోవడంతో ప్రమాదం
- కపుగెదర ముఖాన్ని తీవ్రంగా గాయపరిచిన బంతి
- ఆసుపత్రిలో కోలుకుంటున్న శ్రీలంక వెటరన్
శ్రీలంక వెటరన్ ఆటగాడు చమర కపుగెదర తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అబుదాబిలో పాకిస్థాన్‌తో జరిగిన మూడో వన్డేలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 48.2 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌట్ అయింది.
అనంతరం 209 పరుగుల విజయ లక్ష్యంతో పాక్ బ్యాటింగ్ ప్రారంభించింది. ఈ క్రమంలో పదో ఓవర్ ముగిశాక వికెట్ కీపర్ నిరోషన్ డిక్‌వెల్లా బంతిని అందుకుని దూరంగా వెళ్తున్న కపుగెదరవైపు విసిరాడు. అయితే కీపర్ బంతి విసరడాన్ని కపుగెదర గమనించకపోవడంతో బంతి వేగంగా వచ్చి అతడి ముఖాన్ని బలంగా తాకింది.
అయితే, కంటికి కొద్దిగా కింద తగలడంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే కన్ను పోయి ఉండేది. బంతి తాకడంతో కంటిపై పెద్ద బొడిపె ఏర్పడింది. దీంతో వెంటనే అతడిని వైద్యం కోసం తరలించారు. కపుగెదర పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడని టీం మేనేజ్‌మెంట్ తెలిపింది. కాగా, ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఇదిలా ఉంచితే, మైదానంలో గతంలోనూ ఇటువంటి ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 2012లో దక్షిణాఫ్రికా ఆటగాడు మార్క్ బౌచర్ కూడా ఇలాగే గాయపడ్డాడు. స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ వేసిన బంతికి గీమల్ హుస్సేన్ క్లీన్ బౌల్డ్ కాగా, బంతి అదే వేగంతో దూసుకెళ్లి వికెట్ల వెనక ఉన్న బౌచర్ ముఖాన్ని గాయపరిచింది.