kim jong un: కిమ్ జాంగ్ మాయమైతే మమ్మల్ని మాత్రం అడగవద్దు: సీఐఏ కీలక వ్యాఖ్య
- ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్న కిమ్
- ఆయనకేమైనా అయితే మమ్మల్ని అనొద్దు
- యూఎస్ సీఐఏ డైరెక్టర్ మైక్ పాంపియో
నిత్యమూ అధికారం కోసం తాపత్రయపడుతూ, తమ దేశ ప్రజలతో పాటు ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతూ ఉన్న కిమ్ జాంగ్ ఉన్ కనిపించకుండా పోతే, తమను మాత్రం అడగవద్దని యూఎస్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజన్సీ కీలక వ్యాఖ్యలు చేసింది. గత కొంత కాలంగా వరుస క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్న ఆయన, ఇకపై చడీ చప్పుడు లేకుండా ఉంటే, ఏం జరిగిందో తమను ప్రశ్నించవద్దని యూఎస్ గూఢచార విభాగం సీఐఏ డైరెక్టర్ మైక్ పాంపియో వ్యాఖ్యానించారు.
కిమ్ జాంగ్ ఉన్ నాశనమైపోతే, అది చరిత్రలో మిగిలిపోతుందే తప్ప, తాను మాత్రం ఆ విషయం గురించి మాట్లాడబోనని పాంపియో అన్నారు. జాతీయ భద్రతా అధికారులతో వాషింగ్టన్ లో సమావేశమైన ఆయన ప్రసంగిస్తూ, ఇరాన్, కాంగో, క్యూబా, వియత్నాం, చీలీ వంటి దేశాల్లో నేతలను హతమార్చింది సీఐఏనన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, కిమ్ మాయమైతే, కాకతాళీయమే అవుతుందని, సీఐఏ ప్రమేయం ఉండదని చెప్పారు.
కాగా, కిమ్ ను హతమార్చేందుకు సీఐఏ, సౌత్ కొరియా ఇంటెలిజెన్స్ ఏజన్సీలు కుట్ర పన్నాయని ఇటీవల ఉత్తర కొరియా ఆరోపించిన సంగతి తెలిసిందే. నార్త్ కొరియాతో తాము దౌత్య పరమైన మార్గంలోనే వెళ్లాలని భావిస్తున్నామని ఈ సందర్భంగా పాంపియో వ్యాఖ్యానించారు.