ys jagan: జగన్ పాదయాత్ర నేపథ్యంలో.. 'కోర్టు హాజరు నుంచి మినహాయింపు' పిటిషన్ పై మొదలైన విచారణ!
- పాదయాత్రకు అనుమతించాలని కోరిన జగన్
- విచారణ ప్రారంభించిన నాంపల్లి సీబీఐ కోర్టు
- మధ్యాహ్నం తరువాత తీర్పు వెలువడే అవకాశం
ఈ ఉదయం నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో వైకాపా అధినేత వైఎస్ జగన్ దాఖలు చేసిన రెండు కీలక పిటిషన్లపై విచారణ మొదలైంది. ఏపీలో ప్రతిపక్ష నేతగా ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు, ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపేందుకు పాదయాత్రను చేపట్ట నిర్ణయించామని, అందుకు నవంబర్ 2 నుంచి ఆరు నెలలపాటు కోర్టుకు తాను రాలేనని, ప్రత్యక్ష హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ కోర్టును కోరారు.
అయితే, జగన్ చేసింది చిన్న తప్పు కాదని, హాజరు నుంచి మినహాయింపు ఇవ్వవద్దని గత వారంలో సీబీఐ వాదించింది. దీనిపై ప్రస్తుతం ఇరు పక్షాల వాదనలనూ న్యాయమూర్తి వింటున్నారు. మధ్యాహ్నం తరువాత తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణుల అంచనా. ఇదిలావుండగా, అక్రమాస్తుల కేసు తప్పుడుదని, తమ పేర్లను తొలగించాలని కోరుతూ జగన్, విజయసాయిరెడ్డి వేసిన పిటిషన్లపైనా నేడు విచారణ మొదలుకానుంది. కాగా, జగన్ తదితరుల రాకతో కోర్టు ప్రాంగణంలో సందడి నెలకొనగా, పోలీసులు భద్రతను పెంచారు.