nepal: నేపాల్‌లో దీపావళి పండగ... శునకాలకు పూజ!
- ఐదురోజులు జరిగే పండగ
- మొదటి రోజు కాకులను పూజిస్తారు
- రెండో రోజు శునకాలకు పూజలు
భారత దేశంలో జరిగే దీపావళిని నేపాల్‌లోని హిందువులు మాత్రం వినూత్నంగా జరుపుకుంటారు. ఐదు రోజుల పాటు జరిగే తిహార్ పండగను దీపావళి రోజే ప్రారంభిస్తారు. ఈ పండగలో మొదటి రెండ్రోజులు జంతువులకు పూజ చేస్తారు. ముఖ్యంగా రెండో రోజు కుకుర్ తిహార్ పేరుతో శునకాలకు చేసే పూజ ఈ పండగలో హైలైట్. భారత్‌లోని అసోం, సిక్కిం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ పండగను జరుపుకుంటారు.
మనుషులకు, జంతువులకు మధ్య ఉండే బంధాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ పండగ జరుపుకుంటారు. ఈ సందర్భంగా కాకులు, ఆవులు, శునకాలను పూజిస్తారు. వాటికి దండలు వేసి, బొట్లు పెట్టి, పూజలు చేసి, ఇష్టమైన ఆహారాన్ని పెడతారు. ఈ పండగ ప్రస్తావన రుగ్వేదంలో కూడా ఉందని వారు చెబుతారు.
స్వర్గాధిపతి ఇంద్రునికి రథం వెతకడంలో, శునకాల మాత సమార సహాయం చేసిందని వారు చెబుతారు. అలాగే మృత్యుదేవుడు యముడికి శునకం దూత అని, మహాభారతంలో కూడా శునకం లేనిదే తాను స్వర్గంలో ప్రవేశించబోనని యుధిష్టిరుడు (ధర్మరాజు) అన్నట్లుగా వారు చెబుతారు. అలాగే తమ దుఃఖాలను దూరం చేయాలని కోరుతూ మొదటిరోజు కాకులను పూజించాలని నేపాలీలు నమ్ముతారు.