dsp: పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన డీఎస్పీ రవిబాబు.. కొలిక్కి వచ్చిన హత్యల కేసులు!
- గేదెల రాజు హత్య కేసు దర్యాప్తుతో పరిష్కారమైన పద్మలత హత్య కేసు
- రెండు హత్యలు చేయించింది డీఎస్పీ రవిబాబే
- తనపై కేసు పెట్టడంతో పద్మలతను హత్య చేయించిన రవిబాబు
రౌడీ షీటర్ గేదెల రాజు హత్య కేసులో డీఎస్పీ రవిబాబు చోడవరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. దీంతో రెండు మర్డర్ కేసులపై స్పష్టత వచ్చింది. పదేళ్ల క్రితం చోడవరంలో రవిబాబు సీఐగా పని చేసేవారు. అప్పట్లో పాయకరావుపేట ఎమ్మెల్యేగా కాకర్ల నూకరాజు పనిచేసేవారు. ఈ క్రమంలో రవిబాబు ఆయన కుమార్తె, దివంగత పద్మలతతో సన్నిహితంగా ఉండేవారు.
అయితే, తనను వివాహం చేసుకుంటానని మోసం చేశాడంటూ 2016లో పద్మలత పోలీసు ఉన్నతాధికారులకు రవిబాబుపై ఫిర్యాదు చేసింది. దీంతో తన బండారం బయటపడుతుందని భావించిన రవిబాబు.. ఆమెను హత్య చేయించాలని ప్లాన్ వేసి, కోటి రూపాయలకు ఎమ్మెల్యే కుటుంబానికి సన్నిహితుడైన రౌడీ షీటర్ గేదెల రాజుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత ఆమె కొన్నాళ్లకే మరణించింది.
ఈ క్రమంలో ఆమెను హత్య చేసినందుకు రాజుకి 50 లక్షల రూపాయలను రవిబాబు అందజేశారు. అయితే ఒప్పందం ప్రకారం మిగిలిన 50 లక్షల రూపాయలు ఇవ్వాలని రవిబాబును రాజు డిమాండ్ చేస్తుండేవాడు. అంతే కాకుండా, ఈ హత్య కేసులో ప్రధాన ముద్దాయి రవిబాబు అన్న విషయాన్ని బయటపెడతానని బెదిరింపులకు దిగేవాడు. దీంతో రాజుతో ఎప్పటికైనా ప్రమాదమని గుర్తించిన రవిబాబు, మరొక కిరాయి హంతక ముఠాతో ఒప్పందం చేసుకుని క్షత్రియ భేరి భవనంలో రాజును హత్య చేయించాడు.
అనంతరం ఈ కేసులో నిందితులు వరుసగా అరెస్టు కావడంతో 'ఏ వన్' ముద్దాయి పెందుర్తి డీఎస్పీ రవిబాబు అని తేలింది. దీంతో ఆయన కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఆయన చోడవరం పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయారు.