venkayyanaidu: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు అస్వస్థత.. స్టెంటు వేసిన వైద్యులు
- బీపీ, షుగర్ లెవెల్స్ పెరిగినట్టు గుర్తించిన ఎయిమ్స్ వైద్యులు
- ముందు జాగ్రత్తగా ఎయిమ్స్ కు తీసుకెళ్లిన సిబ్బంది
- గుండె రక్తనాళాల్లో సమస్య గుర్తింపు
- స్టెంట్ వేసిన వైద్యులు
ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు స్వల్ప అస్వస్థతకు గురవడంతో నిన్న ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు. దీంతో వైద్యులు యాంజియోగ్రఫీ చేసి, స్టెంట్ అమర్చారు. ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయనకు ఎయిమ్స్ వైద్యులు వైద్యపరీక్షలు చేశారు. ఆ పరీక్షల్లో ఆయనకు గుండెసమస్యలు ఉన్నట్టు గుర్తించారు. ఈ క్రమంలో నిన్న ఉదయం బీపీ, షుగర్ లెవెల్స్ పెరిగాయి.
దీంతో అప్రమత్తమైన సిబ్బంది ఆయనను ఉదయం 8 గంటల సమయంలో ఆసుపత్రిలో చేర్చారు. దీంతో ఆయనకు ఎయిమ్స్ వైద్యుడు డాక్టర్ బల్ రాం భార్గవ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రక్తనాళాల్లోని సమస్యను పరిష్కరించడంలో భాగంగా స్టెంట్ వేశారు. అనంతరం డాక్టర్ భార్గవ ఆయన మాట్లాడుతూ, ‘‘ఉప రాష్ట్రపతికి యాంజియోగ్రఫీ పరీక్ష చేశాం. ఆయన రక్తనాళాల్లో ఒకటి సన్నబడిందని గుర్తించాం. ఈ నేపథ్యంలోనే స్టెంట్ వేశాం’’ అన్నారు. నేడు ఆయనను డిశ్చార్జ్ చేయనున్నట్టు తెలుస్తోంది.