tajmahal: తాజ్ మహల్ అందమైన శ్మశానం: హర్యానా మంత్రి సంచలన వ్యాఖ్యలు
- వివాదాలకు వేదికవుతున్న తాజ్ మహల్
- యూపీ టూరిజం గైడ్ నుంచి తాజ్ మహల్ ను తొలగించిన నాటి నుంచి వివాదాలు
- కొత్త వివాదాన్ని రేపుతున్న హర్యానా మంత్రి తాజా ట్వీట్
ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచిన చారిత్రక కట్టడం తాజ్ మహల్ వివాదాలకు వేదికగా మారుతోంది. ఉత్తరప్రదేశ్ టూరిజం గైడ్ లో స్థానం కల్పించకపోవడంతో ప్రారంభమైన వివాదం, రాజకీయ నాయకుల వివాదాస్పద వ్యాఖ్యలతో మరింత రాజుకుంటోంది. తాజాగా హర్యానా క్రీడల మంత్రి అనిల్ విజ్ చేసిన ట్వీట్ వివాదం రేపింది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన ఆ ప్రేమ చిహ్నం ఓ అందమైన శ్మశాన వాటిక అంటూ ఆయన ట్వీట్ చేశారు.
ఆయన గతంలో కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజ్ మహల్ భారత సంస్కృతిపై మాయనిమచ్చ అంటూ ఇటీవలే యూపీ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ వివాదం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన తలెత్తింది. ఈ వివాదం పూర్తిగా సమసిపోకముందే ఇప్పుడు మంత్రి చేసిన ఈ వ్యాఖ్య వివాదాన్ని మరింత పెంచేలా వుంది.