srishanth: మరో దేశానికి వెళ్లి ఆడుకుంటానన్న శ్రీశాంత్.. ఆ పప్పులుడకవన్న బీసీసీఐ!
- మరో దేశానికి వెళ్లి క్రికెట్ ఆడుకుంటా అంటున్న శ్రీశాంత్
- బీసీసీఐ ప్రైవేటు సంస్థ
- ఐసీసీ సభ్యత్వమున్న ఏ దేశంలోనూ శ్రీశాంత్ ఆడేందుకు వీలుపడదు
టీమిండియా నిషేధిత పేసర్ శ్రీశాంత్ బీసీసీఐపై ఎదురు దాడికి దిగాడు. తనపై నిషేధం ఎత్తివేయకపోతే వేరే దేశానికి వెళ్లి క్రికెట్ ఆడుకుంటానని హెచ్చరించాడు. శ్రీశాంత్ పై విధించిన నిషేధాన్ని పునరుద్ధరిస్తూ కేరళ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశించిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, భారత్ లో తనపై నిషేధం ఉండడం వల్ల ఇక్కడ ఆడడం కుదరదని, అందుకని వేరే దేశానికి వెళ్లి ఆ దేశం తరపున ఆడతానని అన్నాడు. తన వయసు 34 ఏళ్లని చెప్పిన శ్రీశాంత్, మరో ఆరేళ్లపాటు తాను క్రికెట్ ఆడగలనని అన్నాడు. బీసీసీఐ ప్రైవేటు సంస్థ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని శ్రీశాంత్ సూచించాడు.
అయితే, శ్రీశాంత్ బెదిరింపులపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీసీఐ, అతనికి కౌంటర్ ఇచ్చింది. ఐసీసీలో ఫుల్ మెంబర్ షిప్ ఉన్న ఏ దేశంలోనూ అతడు క్రికెట్ ఆడలేడని స్పష్టం చేసింది. దీనిపై చర్చ అవసరం లేదని బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి స్పష్టం చేశారు. ఐసీసీలో శాశ్వత సభ్యత్వం ఉన్న దేశం లేదా బోర్డు ఒక ఆటగాడిపై నిషేధం విధిస్తే అతను ఐసీసీలో శాశ్వత సభ్యత్వం ఉన్న మరో దేశంలో గానీ, అసోసియేషన్ లో కానీ ఆడేందుకు వీలుకాదని ఆయన తెలిపారు. న్యాయపరంగా బీసీసీఐ పరిధి ఏమిటో తమకు బాగా తెలుసునని ఆయన అన్నారు. కాగా, 2013 ఐపీఎల్ లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో శ్రీశాంత్ పై జీవితకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే.