sharmila reddy son kidnap: మలుపులు తిరుగుతున్న రాజమహేంద్రవరం వైసీపీ నాయకురాలు షర్మిలారెడ్డి కుమారుడి కిడ్నాప్ వ్యవహారం!
- ఇబ్బంది పెట్టేందుకే కిడ్నాప్ అనే అంచనాకు వచ్చిన పోలీసులు
- పక్కా ప్లాన్ తో కిడ్నాప్ చేయలేదు
- డబ్బు కోసం చేసిన కిడ్నాప్ కాదు
తూర్పు గోదావరి జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి, రాజమహేంద్రవరం కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ షర్మిలారెడ్డి కుమారుడి కిడ్నాప్ ఉదంతం ఉత్కంఠను రేపుతోంది. బుధవారం రాత్రి ఆమె కుమారుడిని కారుతో సహా దుండగుడు ఎత్తుకెళ్లాడు. అయితే, కారు వేగం తగ్గిన సమయంలో ఆ బాలుడు కారు నుంచి దూకేశాడు. మరుసటి రోజు తెల్లవారుజామున కారును సదరు ఆగంతుకుడు గోకవరంలో వదిలాడు. అంతేకాదు, కారు ఉన్న ప్రదేశానికి సంబంధించిన వివరాలను వివరిస్తూ గురువారం ఉదయం షర్మిల నివాసం వద్ద ఓ లేఖను వదిలాడు. ఈ వ్యవహారం పలు అనుమానాలకు తావిస్తోంది. తెలిసిన వ్యక్తులే ఈ కిడ్నాప్ కు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.
బుధవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఏవీ అప్పారావు రోడ్డులోని తన రెస్టారెంట్ నుంచి కుమారుడితో కలసి ఇన్నోవా వాహనంలో షర్మిల తన ఇంటికి వచ్చారు. కుమారుడిని కారులోనే ఉంచి, కుమార్తెను తీసుకురావడానికి ఆమె లోపలకు వెళ్లారు. వెంటనే ఆగంతుకుడు బాలుడితో సహా కారును ఎత్తుకెళ్ళాడు.
షర్మిలను రాజకీయపరంగా ఇబ్బంది పెట్టేందుకే ఈ కిడ్నాప్ డ్రామా ఆడి ఉంటారా? అనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ డబ్బుకోసం కిడ్నాప్ చేయాలనుకుంటే... పక్కా ప్లాన్ తో వ్యవహారం నడిపించేవారని అంటున్నారు. కేవలం ఒక వ్యక్తి మాత్రమే కిడ్నాప్ లో పాల్గొనడం, బాలుడికి స్పృహ తప్పే విధంగా చేయకపోవడం, నీకు ఏమీ కాదులే అంటూ బాలుడికి ధైర్యం చెప్పడం, కారులో నుంచి బాలుడు దూకుతుంటే అడ్డుకోక పోవడం... తదితర పరిణామాలను చూస్తుంటే, ఆగంతుకుడు కిడ్నాప్ చేయడానికి రాలేదనే అంచనాకు పోలీసులు వస్తున్నారు. కేవలం షర్మిలను ఇబ్బంది పెట్టేందుకే ఈ వ్యవహారం నడిపినట్టు అనుమానిస్తున్నారు.