dowry: కాంట్రావర్శీ: వరకట్నం వల్ల లాభాలు వున్నాయి.... బెంగళూరు కాలేజీ కొత్త పాఠాలు!
- అందంగా లేని అమ్మాయిలకు పెళ్లి చేసేందుకు ఉపయోగం
- డబ్బులేని మెరిట్ విద్యార్థులకు ఉపయోగం
- అందమైన అబ్బాయిలతో కూతురి పెళ్లి చేయవచ్చు
దశాబ్దాలుగా భారతదేశాన్ని వరకట్న భూతం పట్టి పీడిస్తోందని, దాన్ని తీసుకోవద్దని ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ కాలేజీ మాత్రం వరకట్నం తీసుకోవడం వల్ల ప్రయోజనాలను, లాభాలను వల్లె వేస్తోంది. సోషియాలజీ పాఠ్యాంశాల్లో భాగంగా ఈ అంశాలను బోధిస్తోంది. 1961 నుంచి వరకట్నం తీసుకోవడాన్ని భారత ప్రభుత్వం చట్టవిరుద్ధం చేసింది. అయినప్పటికీ ఇంకా వరకట్నం తీసుకుంటూనే ఉన్నారు.
వరకట్నం తీసుకోవడం వల్ల ఉండే 7 ఉపయోగాలను పాఠ్యాంశంలో పేర్కొన్నారు. ఎక్కువ కట్నం ఇవ్వడం వల్ల అందవిహీనంగా ఉన్న అమ్మాయిల పెళ్లి చేయవచ్చని, అందమైన అబ్బాయిలను ఎక్కువ కట్నం ఆశజూపి పెళ్లికి ఒప్పించవచ్చని, కట్నం వల్ల కొత్తగా పెళ్లైన వాళ్లు కలిసి జీవించడానికి కొంత ఆర్థిక సాయంగా ఉంటుందని, మెరిట్ విద్యార్థులు ఉన్నత చదువులకు ఉపయోగపడుతుందని, ఎక్కువ కట్నం తెచ్చిన అమ్మాయిని అత్తారింట్లో ఎక్కువ ప్రేమగా చూస్తారని, ఎక్కువ కట్నం ఇచ్చి పెళ్లి చేసిన వారి స్థాయిని సమాజం గుర్తిస్తుందని, అమ్మాయికి తండ్రి ఆస్తిలో భాగం ఇవ్వడం కంటే కట్నం ఇచ్చి పంపించేసే ఉపయోగం ఉందని అందులో పేర్కొన్నారు.
దీనిపై విమర్శలు తలెత్తడంతో సదరు కళాశాల స్పందించింది. ఈ పాఠ్యాంశం సంగతి తాము గమనించలేదని, దీనికి మూల కారణం ఏంటనే విషయం తెలుసుకోవడానికి విచారణ చేపట్టామని, తమ కళాశాల ఇలాంటి వాటిని ప్రోత్సహించదని సెయింట్ జోసెఫ్ కళాశాల పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ప్రొఫెసర్ కిరణ్ జీవన్ తెలిపారు.