up: దొంగను కాపాడేందుకు 50 వేలు లంచం తీసుకున్న బీజేపీ మహిళా నేత అరెస్టు!
- కుమారుడి కేసు విషయంలో బీజేపీ మహిళా నేతను ఆశ్రయించిన తల్లి
- 50,000 రూపాయలిస్తే కాపాడతానని హామీ
- డబ్బులిచ్చినా జైలు కెళ్లిన కుమారుడు
దొంగను కాపాడేందుకు లంచం తీసుకున్న బీజేపీ మహిళా మోర్చా నేతను గోరఖ్ పూర్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకున్న ఘటన వివరాల్లోకి వెళ్తే...గోరఖ్ పూర్ లోని అవాస్ వికాస్ కాలనీకి చెందిన హర్షిత్ పాండే అనే యువకుడు సెల్ ఫోన్ చోరీ కేసులో అరెస్టయ్యాడు. దీంతో పోలీసులు అతని తల్లి రీటా పాండేకు సమాచారం అందించారు. దీంతో ఆమె తనకు తెలిసిన వారితో కలిసి మాగానగర్ కు చెందిన బీజేపీ మహిళా మోర్చా నాయకురాలైన సరితా సింగ్ ను ఆశ్రయించారు.
తన కుమారుడ్ని ఎలాగైనా కాపాడాలని, జైలుకు వెళ్లకుండా చూడాలని వేడుకున్నారు. దీంతో ఆమె యాభై వేల రూపాయలు ఇస్తే హర్షిత్ ను జైలుకు వెళ్లకుండా కాపాడుతానని చెప్పారు. దీంతో ఆమె అడిగినట్టే డబ్బులు తెచ్చి ఇచ్చారు. అయితే పోలీసులు హర్షిత్ పాండేను జైలుకి పంపారు. దీంతో మోసపోయానని తెలుసుకున్న రీటా పాండే నేరుగా సీఎం యోగిఆదిత్యనాథ్ ను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో యోగి ఆదేశాలతో పోలీసులు సదరు మహిళా నేతను అదుపులోకి తీసుకున్నారు.