Pakistan: పాకిస్థాన్ లో భారతీయ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కోసం పోరాడుతూ కిడ్నాపైన పాక్ మహిళా రిపోర్టర్ విడుదల

  • ప్రియురాలి కోసం ముంబై నుంచి పాకిస్థాన్ వెళ్లిన యువకుడు గూఢచర్యం కేసులో అరెస్టు
  • అతని తల్లి తరపున పాక్ సుప్రీంకోర్టులో పోరాటం ప్రారంభించిన జర్నలిస్టు జీనత్ షాజాదీ
  • ఒకరోజు ఆఫీసుకు వెళ్తుండగా కిడ్నాపైన జీనత్
  • బలూచ్ యువకులు, గిరిజనుల సాయంతో ఇల్లు చేరిన జీనత్

భారతీయ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తరపున న్యాయస్థానంలో పోరాడుతూ, 2015 ఆగస్టు 19న ఆఫీసుకు వెళ్తుండగా కిడ్నాప్ కు గురైన మహిళా జర్నలిస్టు జీనత్ షాజాదీ (26) అసాంఘిక శక్తుల చెరనుంచి ఎట్టకేలకు విడుదలయ్యారు. పాకిస్థాన్ సరిహద్దుల్లోని బలుచిస్తాన్‌ యువకులు, గిరిజనుల సాయంతో ఆమెను విడిపించినట్టు సీఐఈడీ ప్రెసిడెంట్‌ జస్టీస్‌ జావేద్‌ ఇక్బాల్‌ తెలిపారు.

ఆమె కిడ్నాప్ ఘటన వివరాల్లోకి వెళ్తే... ముంబైకి చెందిన ఐటీ ఇంజినీర్ హమీద్ అన్సారీ ఫేస్‌ బుక్‌ లో తనకు పరిచయమైన పాకిస్థానీ యువతితో ప్రేమలో పడ్డాడు. ఆమె కూడా ప్రేమకు అంగీకరించడంతో ఆమెను కలిసేందుకు పాక్ వెళ్లాలని భావించి, వీసాకు దరఖాస్తు చేశాడు.

అయితే, వీసా రాకపోవడంతో 2012 నవంబర్ 4న అక్రమంగా కాబూల్ చేరుకొన్నాడు. దీనికి ఆన్‌ లైన్ ఫ్రెండ్స్ సాయం చేశారు. వారే అతనికి ఖైబర్ ఫంక్తూక్ లోని కోహత్ అనే పట్టణంలోని ఒక హోటల్‌ లో వసతి సౌకర్యం ఏర్పాటు చేశారు. సరిగ్గా వారం రోజులకు అంటే 2012 నవంబర్ 14న అతనిని పాక్ పోలీసులు గూఢచర్యం కేసులో అదుపులోకి తీసుకుని, భద్రతా సిబ్బందికి అప్పగించారు. అనంతరం భారత్ కు సమాచారం అందించారు.

 అప్పట్లో అతని తల్లికి సాయం చేసేందుకు 'నయీ ఖబర్' అనే స్థానిక దినపత్రికలో రిపోర్టర్‌ గా పనిచేస్తున్న జీనత్ ముందుకు వచ్చారు. ఇది అప్పట్లో పాకిస్థాన్ లో తీవ్ర కలకలం రేపింది. హమీద్ అన్సారీని కాపాడేందుకు అతని తల్లి ఫౌజియా అన్సారీ తరపున జీనత్ షాజాదీ పాక్ సుప్రీంకోర్టులో మానవహక్కుల విభాగంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో గుర్తుతెలియని దుండగులు ఆమెను 2015 ఆగస్టు 19న ఆటోలో వెళుతుండగా కిడ్నాప్ చేశారు. అప్పటి నుంచి ఆమె ఆచూకీ కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.

 తన అక్కను కాపాడుకునేందుకు ఆమె తమ్ముడు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఆమె ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆమె కోసం వెతికి వెతికి విసిగి వేసారిన ఆమె సోదరుడు సద్దాం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, ఆమె ఎవరి కోసం అయితే పోరాడిందో ఆ వ్యక్తి హమీద్ ఇంకా పాక్ జైల్లోనే మగ్గుతున్నాడు. అతని తరపున పాక్ మానవ హక్కుల నేత రెహ్మాన్ పోరాడుతున్నారు.

ఈ క్రమంలో ఆమె ఆచూకీ తెలియడంతో స్థానికుల సాయంతో ఆమెను కాపాడారు. ఆమెను కుటుంబంతో కలపడం ఆనందంగా ఉందని బీనా సర్వర్ అనే సామాజిక కార్యకర్త తెలిపారు. 

  • Loading...

More Telugu News