neeya naana: కేరళ అమ్మాయిలు బాగుంటారా? తమిళ అమ్మాయిలు బాగుంటారా?... ఓ టీవీ కార్యక్రమంలో చర్చ!
- `నీయా.. నానా` కార్యక్రమంలో చర్చ
- ఆదివారం ప్రసారం కానున్న కార్యక్రమం
- ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇరు రాష్ట్రాల ప్రజలు
తమిళనాడులోని స్టార్ విజయ్ ఛానల్లో `నీయా.. నానా (నువ్వా.. నేనా)` అనే కార్యక్రమం ప్రసారమవుతోంది. ఇందులో ఏదో ఒక అంశం మీద రెండు వర్గాలు చర్చించుకుంటాయి. ఈ కార్యక్రమంలో మాట్లాడే వారి అభిప్రాయాలు చాలా సార్లు వివాదాస్పద చర్చనీయాంశంగా మారాయి. కానీ ఈ వారం ఆ కార్యక్రమంలో ప్రసారం కానున్న అంశమే పెద్ద టాపిగ్గా మారింది.
ఇంతకీ, ఆ అంశం ఏంటంటే.... కేరళ అమ్మాయిలు బాగుంటారా? తమిళ అమ్మాయిలు బాగుంటారా?...దీనికి సంబంధించిన ప్రోమోను కూడా టీవీ ఛానల్ విడుదల చేసింది. పిల్లల్ని బుజ్జగించడంలో తేడా, వేషధారణ, డ్యాన్సింగ్ స్టైల్ ఇలా కొన్ని అంశాల మీద ఇరు వర్గాల అమ్మాయిలు వాదనలు విసురుకోవడం ప్రోమోలో చూడొచ్చు. ఆదివారం మధ్యాహ్నం 3 గం.లకు ప్రసారం కానున్న ఈ కార్యక్రమానికి సంబంధించి స్టార్ విజయ్ ఛానల్ సోషల్ మీడియాలో పోలింగ్ కూడా ఆవిష్కరించింది. ఇప్పటికే ఈ పోల్కి 1000 మందికి పైగా ఓటింగ్ చేశారు.
`జిమ్మిక్కీ కమ్మాల్` పాటకు డ్యాన్స్ వేసి ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన మలయాళ కుట్టి షెరిల్‌కి తమిళనాడు యువత అభిమానులుగా మారారు. దీంతో అక్కడి యువత తమిళ అమ్మాయిల కంటే కేరళ అమ్మాయిలే బాగుంటారని సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. దీని గురించి తేల్చడానికి ఈ కార్యక్రమ నిర్వాహకులు ఈ అంశాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇంత సున్నిత అంశాన్ని తీసుకోవడంపై కొంతమంది నిపుణులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో ఉన్న భేదాలు సరిపోక, ఇలా కొత్త భేదం సృష్టించడం సబబు కాదని మందలిస్తున్నారు. మరి కొంతమంది మాత్రం ఇదే టాపిక్‌ని మగవాళ్ల విషయంలో కూడా పెట్టాలని సూచిస్తున్నారు. ఈ వివాదాస్పద అంశానికి చివరికి ఎలాంటి సమాధానం దొరుకుతుందో తెలుసుకోవడానికి ఇరు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనేది వాస్తవం.