contest: గుజరాత్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు ఝలక్!
- పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్న బీజేపీ
- 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బరిలోకి దింపనున్న కాషాయ పార్టీ
- ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికల్లోనూ ఇదే వ్యూహంతో విజయం
గుజరాత్ ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్న కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన 14 మంది రెబల్ ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు బీజేపీ పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోంది. బీజేపీ తరపున పోటీ చేయనున్న వారిని ప్రస్తుత సీట్ల నుంచే బరిలోకి దింపాలని నిర్ణయించింది. 12 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు రాబోయే ఎన్నికల్లో బీజేపీ తరపున బరిలోకి దిగనున్నట్టు బీజేపీ ధ్రువీకరించింది. ఇక కొత్త పార్టీ ప్రారంభించిన శంకర్ సింగ్ వాఘేలా, ఆయన కుమారుడు మహేంద్రసింగ్ వాఘేలాలు కాషాయ పార్టీతో కలిసి పనిచేస్తారని పేర్కొంది.
కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల రాకతో బీజేపీ మరింత బలపడుతుందని భావిస్తున్నట్టు పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. వారి ఓటు బ్యాంకుతో బీజేపీ లాభపడుతుందని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికల్లోనూ బీజేపీ ఇదే విధమైన వ్యూహాన్ని అమలు చేసి విజయం సాధించింది. ఆయా రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీఎస్పీకి చెందిన పలువురు నేతలను బరిలోకి దించింది.