mersel movie: 'మెర్సెల్' డైలాగుల కలకలం... బీజేపీ నేతపై మండిపడిన ఫర్హాన్ అఖ్తర్
- సినిమా వాళ్లకు బుర్రలేదన్న బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు
- అలా అనడానికి ఎంత ధైర్యం? అంటూ మండిపడిన ఫర్హాన్ అఖ్తర్
- 'సిగ్గు పడాలి' అంటూ ట్వీట్ ను ముగించిన ఫర్హాన్
తమిళనాడులో భారీ విజయం సాధించిన మెర్సెల్ సినిమాలో జీఎస్టీపై విజయ్ సంధించిన డైలాగులు పెనుకలకలం రేపుతున్నాయి. వీటికి థియేటర్లలో చప్పట్లు హోరెత్తుతుండగా, బీజేపీ నేతలు మాత్రం మండిపడుతున్నారు. ప్రధాని నిర్ణయాన్నే తప్పుపడతారా? అంటూ స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా వాళ్లకు బుర్రలేదంటూ బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై ఫర్హాన్ అఖ్తర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సిగ్గుపడాలని సూచించాడు.
దాని వివరాల్లోకి వెళ్తే...జీవీఎల్ఎన్ రావు ఒక టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెర్సెల్ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, 'భారత సినీ నటుల్లో ఎక్కువ మందికి బుర్ర లేదు. వారికి జనరల్ నాలెడ్జ్ కూడా తక్కువే' అన్నారు. దీనిపై సినీ నటుడు, రచయిత, దర్శకుడు, సామాజిక కార్యకర్త ఫర్హాన్ అఖ్తర్ మండిపడ్డాడు. 'అలా అనడానికి మీకు ఎంత ధైర్యం?' అంటూ జీవీఎల్ఎన్ రావును ట్యాగ్ చేశారు. 'చిత్ర పరిశ్రమలో ఉంటున్న వ్యక్తుల గురించి జీవీఎల్‌కు ఉన్న అభిప్రాయం ఇది.. దీన్ని అందరూ తెలుసుకోవాలి' అంటూ ట్వీట్ చేసి చివర్లో 'సిగ్గుపడాలి' అని పేర్కొన్నాడు. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది.