group calling: త్వరలో గ్రూప్ వాయిస్, వీడియో కాలింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టనున్న వాట్సాప్
- సంకేతాలు ఇచ్చిన ఐఓఎస్ బీటా వాట్సాప్ వెర్షన్
- సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తున్న వాట్సాప్
- గ్రూప్ అడ్మినిస్ట్రేటర్లకు ప్రత్యేక హక్కులు కూడా
ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ వినియోగదారులు ఉన్న ఫేస్‌బుక్ వారి వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ నేపథ్యంలోనే త్వరలో గ్రూప్ వీడియో కాలింగ్, గ్రూప్ వాయిస్ కాలింగ్ సదుపాయాలను కూడా కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఐఫోన్లలో ఉపయోగించే వాట్సాప్ అప్‌డేట్ కోడ్‌లో ఈ విషయానికి సంబంధించి సంకేతాలు ఉన్నట్లు అంతర్జాతీయ టెక్నికల్ వెబ్‌సైట్లు చెబుతున్నాయి. గ్రూప్ వీడియో కాలింగ్ గురించి కొద్దిగా సందిగ్ధత ఉన్నా... గ్రూప్ వాయిస్ కాలింగ్ సదుపాయాన్ని మాత్రం వాట్సాప్ త్వరలో తప్పకుండా కల్పించనుందని వివరిస్తున్నాయి. అయితే ఈ ఫీచర్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనే విషయం తెలియాల్సి ఉంది.
గ్రూప్ అడ్మినిస్ట్రేటర్లకు ప్రత్యేక హక్కులు కల్పిస్తూ ఇటీవల వాట్సాప్ అప్‌డేట్ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ అప్‌డేట్ ప్రస్తుతం ఐఓఎస్ వారికి మాత్రమే అందుబాటులో ఉంది. వారం రోజుల్లోగా ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ అప్‌డేట్ రానుంది. దీని వల్ల గ్రూప్ సభ్యుల ప్రవర్తనను గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ నియంత్రించడం, గ్రూప్ సృష్టికర్తను డిలీట్ చేసే అవకాశం లేకపోవడం, గ్రూప్ పేరు, సబ్జెక్టు మార్చే హక్కు గ్రూప్ సభ్యులకు లేకపోవడం వంటి మార్పులు రానున్నాయి.